Jump to content

పుట:భాస్కరరామాయణము.pdf/556

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

ఒగి విభావరి యవసాన మొందకుండ, రవియు నుదయాద్రిమీఁదికి రాకమున్న
యింతలోనన రమ్ము కపీంద్రతిలక, తడవు సేసినఁ గార్యంబు దప్పిపోవు.

1596


క.

ఆకులు మిక్కిలి తెల్లన, ప్రాకటముగ వానిపండ్లు పచ్చన పుష్పా
నీకమ్ము లరయ నెఱ్ఱన, నీ కెఱిఁగించితిని వాని నిజ మగుచిహ్నల్.

1597


శా.

ఈచందంబున నాసుషేణుఁ డన ధాత్రీశుండు సామీరితో
నీచే నీపని సిద్ధిఁ బొందు టిది దా నిక్కంబు వే పొమ్ము ర
మ్మా చిత్రమ్ముగ నాకు సోదరుని నిమ్మా ద్రోణశైలంబు దె
మ్మా చిత్తంబు ప్రమోద మొందఁగ నసామాన్యప్రభావోదయా.

1598


క.

సోదరుల మేము నలువుర, మైదవతో డగుదు వీవు ననయముఁ జేతో
మోదంబు మిగులఁ గలుగున్, నాదెసఁ గృప సేయవయ్య నగచరవర్యా.

1599


మ.

అని యారాముఁడు పల్క నాతఁడు [1]సమగ్రానందుఁ డై యుబ్బి యా
ర్చినఁ గంపించెను లంక వారి కలుషిoచెన్ దిక్కు లల్లాడె భూ
మి నగంబుల్ చలనంబు నొందెఁ బగిలెన్ మి న్నంతలోఁ బుష్పవృ
ష్టి నిలింపుల్ గురియించి గోలి మొరసెం జెల్వారఁగా దుందుభుల్.

1600


వ.

అంత హనుమంతుండు మేదినీకాంతున కి ట్లనియె.

1601


శా.

సప్తద్వీపసముద్రముద్రితమహీ[2]చక్రంబునన్ వేగఁ బ
ద్మాప్తుండుం బొడతేకమున్న యణుమాత్రార్ధంబునన్ వత్తు నే
నాప్తుండం గలుగంగ నౌషధగిరివ్యావృత్తి దా నెంత [3]సం
ప్రాప్తప్రాణునిఁగాఁ దలంపవె యమోఘారంభు నీలక్ష్మణున్.

1602


క.

అనవుడు నాతని నుపగూ, హనమున మన్నించి రఘుకులాధిపుఁడు ముదం
బున నాశీర్వాదంబులు, మన మారఁగ నొసఁగె ననుపమానప్రీతిన్.

1603


సీ.

హరి శిర మాదిత్యుఁ డాననపద్మంబు, శశి మనోవృత్తియు శైలతనయ
కటియు వాయువు వీఁపు కామారి వాలంబు, నగ్ని పాదంబులు నబ్జభవుఁడు
మతిఁ బాశహస్తుండు మహనీయశక్రియుఁ, బంకజనాభుండుఁ బాణియుగము
గజముఖుఁ డుదరంబుఁ గడఁకతో నేప్రొద్దుఁ, గాతురు నినుఁ బ్రీతిఁ బ్రోతు రెపుడు
ననిన నుత్సుకుఁడై యాతఁఁ డడరి యుబ్బి, వినయసంభ్రమసద్భక్తివివశుఁ డగుచు
వీరశేఖరుపాదారవిందములకు, నెరఁగి వానరకోటులు నెలమిఁ జెలఁగ.

1604

హనుమంతుఁడు రెండవసారి సంజీవనిఁ దేఁబోవుట

సీ.

శేషాహి వ్రేఁగున శిరములు వంపంగ, నవనీధరంబుపై నడ్గు నూఁది
సురరాజకరికరస్థూలహస్తంబులు, మింటితో నొరయంగ మీఁది కెత్తి
వాసుకి కెన యన వాలినవాలంబు, పెఱిగి చుక్కలతోడ నొరయుచుండ

  1. సమగ్రారంభుఁడై
  2. చక్రంబు వేగంబ పద్మా
  3. "సంప్రాప్తప్రాణుఁ దలంపు లక్ష్మణు నమోఘారంభసంభావనా”. అనియే వ్రా. ప్ర.