పుట:భాస్కరరామాయణము.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కోమలచారుదుకూలంబు లెడలించి, కర్కశవల్కాంశుకములు గట్టి
పరిలిప్తచందనపంకంబు పోఁజేసి, నిర్మలభసితంబు నిండ నలఁది
మహనీయబహురత్నమండనంబులు వుచ్చి, లీలమై నక్షమాలికలు దాల్చి
రాజజూటునోజ రమణీయతేజోవి, రాజమానమూర్తి రాజకీర్తి
రఘుకులాబ్ధిజనితరత్నంబు రాజన్య, చక్రవర్తి రామచంద్రుఁ డొప్పె.

65


వ.

తదనంతరంబ జనకరాజపుత్రియు సౌమిత్రియుం దపోవేషంబులు గైకొని రప్పు
డారాజపరమేశ్వరం డగురాఘవేశ్వరుం డన్నరేశ్వరుం గనుంగొని.

66


సీ.

పదునాలుగేఁడులు పదునాల్గు దినములు, గాఁ బుచ్చి వచ్చెదఁ గాననమున
వర్తించు టిది యెంత వసుధేశ దీనికి, మదిలోన నీ కింత మఱుఁగ నేల
భరతుఁడు నాకంటె భక్తుఁడు గాన నీ, యాజ్ఞ దప్పక చేయు ననుచుఁ బలికి
వలగొని తత్పాదవనజంబులకు మ్రొక్కి, కైకకుఁ బ్రణమిల్లి కడిఁది మూర్ఛఁ
దన్ను మఱచి యున్నతండ్రి వీడ్కొని సుమి, త్రాసుతుండు జనకరాజసుతయుఁ
దోడ రాఁగ ముదముతోఁ దల్లిపాలికి, నరుగుదించె రాముఁ డంత నచట.

67


వ.

కౌసల్యాదేవియుఁ బట్టాభిషేకంబునకు విఘ్నంబు గాకుండ విహితవ్రతోపవా
సంబులు గైకొని సమస్తదేవతాప్రార్థనంబు సేయుచుఁ బుత్రాగమనంబు విని
సంతోషించి విశేషాక్షతాదిమంగళద్రవ్యంబులు గైకొనుచు నీరాజనకరణంబు
లకుఁ బుణ్యాంగనలు తోడరా నెదురేఁగుదెంచి యారాజర్షిరత్నంబుఁ గనుఁగొని.

68


క.

ఉల్లము గలఁగఁగ మొగమున, వెల్లఁదనం బొలయఁ దాల్మి వీడంగఁ గడుం
దల్లడ మందుచు నుండఁగఁ, దల్లికిఁ బ్రణమిల్లి యతఁడు దగ ని ట్లనియెన్.

69


ఉ.

రాజు మహాజి నిచ్చినవరద్వితయంబునఁ గైక నేఁడు వి
భ్రాజితలీలమై భరతుపట్టము నే వనభూమిలోన నీ
యోజఁ జతుర్దశాబ్దము లనూనతపస్థితి నున్కి వేఁడె ని
ట్లాజనయిత్రికోర్కియు నృపాగ్రణిసత్యముఁ జల్పు వేడుకన్.

70


క.

ఏ నిట్లు తపోవేషముఁ, బూని నరేంద్రుండు వగలఁ బొగులుచు నుండం
గా నేతెంచితి నిటకును, మానసమున దీని కింక మఱుఁగకు మనినన్.

71


క.

మూలంబు దెగినతరువును, బోలెం బెనుమూర్ఛ నొంది భూస్థలిమీఁదన్
వ్రాలి యనంతరమున ను, న్మీలితనయనాబ్జ యగుచు నృపరత్నంబున్.

72

కౌసల్య రామునివనగమనవృత్తాంతం బెఱింగి యడలుట

మత్త.

లిప్తనిర్మలభూతిభాసురు లేమ చూచి విషాదసం
తప్తచిత్తముతోడ ని ట్లనుఁ దమ్ముఁడా నిను మేదినీ
గుప్తికై కని యెట్టకేనియు గొడ్డు వీఁగితి నంచు నే
సప్తవింశతివత్సరంబులు సంతసంబున నుండితిన్.

73


శా.

ఇంకం దొల్లిటినోము లి ట్లగుట కే నే మందు నోపుత్ర ని