Jump to content

పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సయ్యద్ నశీర్ అహమ్మద్ 82


కల్లలైన కలలు
బడుగు వర్గాలకు చెందిన రైతన్నకు ఊహించని విధంగా లభించిన అవకాశంతో కలిగిన ఆనందం, ఎంతో కాలం నిలవలేదు. టిపూ తీసుకున్న నిర్ణయాల ఫలితంగా, రైతు అనుకూల మార్పులు స్థిరీకరణపొంది రైతు జనజీవితాలలో శాశ్వత మార్పులు చోటు చేసుకునేలోగా, టిపూ పాలన అస్తమించింది. టిపూ సంస్కరణల మూలంగా భూములతో పాటుగా కోల్పోయిన పలుకుబడి, పెత్తనాన్ని, తిరిగి హస్తగతం చేసుకునేందుకు గోతికాడి నక్కల్లా భూస్వామ్య శక్తులు ఎదురు చూడసాగాయి. అన్ని రకాల ఆధిపత్యాలకు కారణమైన భూములను స్వంతం చేసుకునేందుకు ఆతృత పడసాగాయి. పూర్వవైభవాన్ని కోల్పోయి అవమాన భారంతో రగిలిపోతున్న శక్తులకు, టిపూ పరాజయం ఉపశమనం కలిగించి పూర్వ వైభవాన్ని సంతరించి పెట్టగలదన్న ఆలోచన పెరిగింది. ఆ ఆలోచనల పర్యవసానంగా పరాయి పాలకుల పంచన చేరి, టిపూను పరాజితుడ్ని చేసేందుకు విభీషణ పాత్రను నిర్వహించ పూనుకున్నాయి. పరాయి పాలకులు పాదాక్రాంతులై, స్వదేశీ పాలకుడైన టిపూను పూర్తిగా దెబ్బతీయడానికి ఎదురు చూడసాగాయి.
1792లో ఈస్ట్ ఇండియా కంపెనీతో సాగిన యుద్ధంలో టిపూ పరాజితుడయ్యాడు. ఆ సమయంలో భూస్వాములు, ఉన్నత వర్గాల, వర్ణాలకు చెందిన శక్తులు, వ్యక్తులు ఏకమై కంపెనీ పాలకులకు తోడ్పాటు అందించారు. యుద్ధంలో ఓడిపోయిన టిపూ, మలబారును ఈస్ట్ ఇండియా కంపెనీకి ధారాదత్తం చేయాల్సి వచ్చింది. మలబారు ప్రాంతంలోని ఒక్క వేనాడు తప్ప మిగతా ప్రాంతాలను టిపూ బ్రిటీషర్లకు కోల్పోయాడు. ఆ తరువాత జరిగిన యుద్ధాలు టిపూకు నష్టదాయకంగా పరిణమించాయి. చివరకు 1799లో శ్రీరంగపట్నం వద్ద జరిగిన నాల్గవ మైసూరు యుద్ధంలో టిపూ అమరత్వం పొందాడు.
టిపూ మరణంతో వేనాడు ప్రాంతంతో సహా మలబారు ఉత్తర దక్షిణ ప్రాంతాలు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన క్రిందకు వచ్చేశాయి. అధికారం చేపట్టగానే టిపూ సుల్తాన్ రెవిన్యూ సంస్కరణలను కంపెనీ పాలకులు తిరగతోడటం ప్రారంభించారు. మలబారును తమ ఆధీనంలో ఉంచుకునేందుకు, ఆయా ప్రాంతాల సంస్థానాధీశుల నుండి ఎటువంటి ప్రతిఘటనలు లేకుండా చూసుకునేందుకు, మలబారులోని భూస్వాములను మంచి చేసుకునేందుకు ప్రయత్నించారు. రెవిన్యూ మీదనే సదా కన్నువేసే బ్రిటీషర్లు, భూముల మీద పెత్తనం జెన్మిలకు అప్పగించి రెవిన్యూను మాత్రం తమ ఖజానాలకు చేర్పించే పద్ధతులకు శ్రీకారం చుట్టారు. కంపెనీ అధికారులను మంచి చేసుకుని తమ భూములతో పాటుగా వైభవ ప్రాభవాలను కూడా తిరిగి సాధించుకోవాలనుకున్న జెన్మిలు, భూస్వాములు ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నారు. టిపూ సంస్కరణల వలన నష్టపోయిన జెన్మిలను కంపెనీ పాలకులు చేరదీసారు.
ప్రతిఘటనను రగిలించిన కంపెనీ చర్యలు
టిపూ మీద సాధించిన విజయానికి సహాయం చేసిన భూస్వాములకు, రాజాలకు, సామాజిక పెత్తందారులకు తాయిలాలుగా మలబారు ప్రాంతపు భూములన్నిటినీ ఈస్ట్