Jump to content

పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

81 భారత స్వాతంత్య్రోద్యమం-ముస్లిం ప్రజాపోరాటాలు

చేయాలనుకున్నారు. మలబారు ప్రాంతంలోని నాయర్ల ఆధిపత్యానికి గండికొట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రాంతపు రాజుల పెత్తనానికి స్వస్తి పలకాలని, రాజుల సైన్యంలో ప్రధాన పాత్ర వహిస్తూ వచ్చిన నాయర్ , నంబియార్ల ఆధిపత్యానికి గండికొట్టి ఆ ప్రాంతాన్ని పూర్తిగా మైసూరు రాజ్యం కనుసన్నలలో ఉంచాలనుకున్నారు. సైన్యం పూర్తిగా రాజు ఆధీనంలో ఉండాలని భావించారు. అందుకు అనుగుణంగా రాజకీయ, ఆర్థిక, సాంఘిక, రెవిన్యూ సంస్కరణలను అమలులోకి తెచ్చారు.
⁠టిపూ మలబారును హస్తగతం చేసుకోగానే అప్పటివరకు అమలులో ఉన్న జెన్మి, పట్టక్కారన్, కనక్కురన్ భూసంబంధాలను ధ్వంసం చేసాడు. దున్నేవాడిదే భూమి ప్రాతిపదికగా పట్టకారన్లకు ( రైతులు) అనుకూలంగా సంస్కరణలను చేపట్టాడు. మలబారు ప్రాంతం అప్పటివరకు ఎరుగని విప్లవాత్మక భూసంస్కరణలను అమలుచేసాడు. భూస్వాముల ఆధిపత్యానికి గండికొడుతూ, దుక్కి దున్ని పంట పండించేవాడిదే భూమన్నాడు. అందుకుగాను పండిన పంటలో నిర్ణీత భాగాన్ని రాజుకు చెల్లించాలని నిబంధన విధించాడు. పంటలో భాగం చెల్లిస్తే చాలు, ఆ భూమిని ఎవరు దుక్కి దున్ని, నారు వేసి, కోత కోస్తారో అతను ఆ భూమికి అసామి అన్నాడు. రైతు పంటభాగాన్ని క్రమం తప్పకుండా చెల్లిస్తున్నంత కాలం, ఆ భూమి నుండి రైతును తొలగించడానికి రాజుకు కూడా హక్కు ఉండదని ప్రకటించాడు. వ్యయసాయాభివృద్ధికి ప్రభుత్వ ఖజానా నుండి రైతుకు రుణాలను అందచేశాడు. విత్తనాలు అందచేశాడు. అధిక పంటలు పండించమని ప్రోత్సహించాడు.
⁠ఈ విప్లవాత్మక మార్పులవలన భూమి మీద భూకామందుల పట్టు సడలింది. టిపూ అనుసరించిన రైతు అనుకూల విధానాలు భూస్వాముల పెత్తనాన్ని దారుణంగా దెబ్బతీసాయి. ఎటువంటి శ్రమా చేయకుండా విలాసవంతమైన రాజప్రాసాదాలలో కూర్చొని తింటూ, వేలాది ఎకరాల భూమిని గుప్పెట్లో ఉంచుకున్న భూస్వాములకు ఈ పరిస్థితులు మింగుడు పడలేదు. దుక్కి దున్ని, నారు పోసి, నీరు పెట్టి, పైరును కాపాడుకుంటూ, కోతకోసి కష్టపడే రైతు కుటుంబాల జీవితాలను తమ ఇష్టానుసారంగా మలుపులు తిప్పగలిగిన సత్తాతో విర్రవీగిన జెన్మిలు, టిపూ సంస్కరణలను సహించలేక కుతకుతలాడిపోయారు. అనువుకాని చోట అధికులమనరాదంటూ మిన్నకుండిపోయారు. ఈ సంస్కరణల పర్యవసానంగా ఏర్పడిన నూతన భూసంబంధాల పరిణామాలకు కలవరపడిన భూస్వాములు, ధనిక సంపన్న వర్గాలు, పొరుగున ఉన్న ట్రావన్ కోర్ ప్రభువు శరణు జొచ్చారు.
⁠ఈ వాతావరణంలో మోప్లా రైతు జీవన పరిస్థితులలో పెనుమార్పులు సంభవించాయి. మోప్లాల ఆర్థిక స్థితిగతులలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. పంట పొలాలలో కాయకష్టం చేసుకుంటూ భారంగా బ్రతుకులీడ్చుతున్న రైతాంగం జీవితాలలో సంతోషదాయకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. గతకాలపు కష్టాల నుండి గట్టెక్కి ముక్కో - చెక్కో ఎంతో కొంత భూమి తమకు లభించినందుకు రైతాంగం ఆనందించసాగింది. ఈ రకంగా ఆర్థిక పరిస్థితులలో వచ్చిన మార్పులు సామాన్య ప్రజలలో చైతన్యానికి కారణమయ్యాయి.