Jump to content

పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సయ్యద్ నశీర్ అహమ్మద్ 80

ఘర్మజలం చిందిన నేల మీద ఎటువంటి హక్కులు పొందలేని అభాగ్యులు. బ్రతుకంతా భూకామందుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి, పంట పండినా పండకపోయినా, తాము తిన్నా తినకపోయినా, భూస్వాముల గాదెలు నింపుతూ, అర్థాకలితో జీవితాలు గడిపే అన్నార్తులు. పంట పండక కౌలు చెల్లించలేని పరిస్థితులు ఎదురైతే, తమ కుటుంబ సభ్యులను భూకామందు వద్ద వెట్టి కుదిర్చి, కౌలు తీర్చే నిజాయతీపరులు. ఏ రోజుకా రోజు పనిని వెతుక్కుని లభించిన డబ్బుతో కుటుంబాలను పోషించుకునే కూలీలు. పని ఉంటే పండగ, లేకుంటే పస్తులతో కాలం గడిపే సామాన్యులు. భూకామందు కౌలు చెల్లింపు కోసం, కుటుంబ బాధ్యతల నిర్వహణ కోసం అప్పులు-సొప్పులు చేయడం, అధిక వడ్డీల చెల్లింపు కోసం మళ్ళీ అప్పులు చేయాల్సిన ఆగత్యం వలన వడ్డీల ఊబిలో చిక్కుకుపోయి, వడ్డీ వ్యాపారుల విష కౌగిలికి బలవుతున్న రుణగ్రస్తులు. భూకామందుల, మధ్య దళారీల చేతుల్లో దోపిడీకి గురవుతున్న బాధాసర్పదృష్టులు. సమస్యల సుడిగుండంలో పడి ఊపిరాడక సతమతమవుతూ ఉన్నప్పటికీ ఆదుకునే నాధుడు లేక, సహాయపడే శక్తులు లేక, వ్యక్తులు రాక నిరాశ నిస్పృహలతో ఎవడో వస్తాడని, ఏదో చేస్తాడని ఎదురు చూపులతో కాలం గడిపే అనాధలు. భూకామందుల, మధ్య దళారీల అవసరాలు తీర్చుతూ, అన్నిరకాల దోపిడీలకు బలవుతూ, భారంగా జీవితాలు గడిపే ప్రజానీకం మలబారు మోప్లాలు. భూస్వాముల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి, చాకిరీ చేసుకుంటూ, భూస్వాములు అడిగినంత పంట భాగం సమర్పించుకుంటూ, భూస్వాముల ఇళ్ళల్లో పండగలు పబ్బాలు, ఉత్సవాలు, సంబరాలు జరిగినప్పుడు, ఖర్చులకుగాను తమకున్నా లేకున్నా కామందు అడిగినంత సమర్పించుకుంటూ, అణిగిమణిగి ఉండటం ఆ రైతాంగం నిత్యకృత్యమైంది.
ఈ పరిస్థితులు సామాన్య ప్రజానీకంలో భాగమైన మోప్లాల భూసంబంధాలు, ఆర్థిక స్థితిగతులకు అద్దం పడతాయి. భూమి మీద హక్కులు గల ఆసామిని, భూస్వామిని 'జెన్న్ లేక జెన్మి' (JENM or JENMI) అని పిలుస్తారు. చిన్న రైతులను, కౌలుదారులను, ఉప కౌలుదారులను 'పట్టక్కారన్' (PATTAKKARANS) అంటారు. భూముల మీద పర్యవేక్షణ జరిపేందుకు భూస్వామి నియమించిన ప్రతినిధిని 'కనక్కురన్' (KANAKKARAN) అని పిలుస్తారు. ఈ కనక్కురన్ను 'అధిగారి' (ADHI-GARI) అని కూడా పిలవడం కద్దు. మలబారు ప్రాంతంలో భూసంబంధాలు ప్రధానంగా ఈ ముగ్గురి చుట్టూ తిరుగుతుంటాయి. జెన్మి ఎన్నడూ తమ భూములలో కాలు పెట్టనప్పటికీ, భూములు ఎక్కడ ఎంత ఉన్నాయో తెలియనప్పటికీ, పండిన పంట మాత్రం జెన్మి గాదెలకు చేరుతుంటాయి. ఈ బాధ్యతలను నెరవేర్చేవాడు కనక్కురన్. జెన్మికి అనుకూలంగా వ్యవహరిస్తూ జెన్మిల నుండి రాయితీలు సంపాదించేవాడు. ఒక రకంగా జెన్మిల ప్రతినిధిగా వ్యవహరించేవాడు. కనుక్కరన్ జెన్మీల నుండి భూమిని కౌలుకు తీసుకునేవాడు.
ఫిరంగీల రాకకు పూర్వ స్థితి
మైసూరు పులి టిపూ సుల్తాన్ 1782లో మలబారు ప్రాంతాన్ని తన సామ్రాజ్యంలో అంతర్భాగం చేసుకున్నాడు. మైసూరు పాలకులు కేంద్రీకృత అధికార వ్యవస్థను పటిష్టం