123 భారత స్వాతంత్య్రోద్యమం-ముస్లిం ప్రజాపోరాటాలు
ఆరడుగుల ఎత్తు, దృఢకాయుడైన ఖాన్కు సైన్యంలో చేరాలని ఆకాంక్ష. సమరశీల
యోధులైన పఠాన్ బిడ్డలు సైన్యంలో చేరాలని అభిలషించేవారు. సర్దార్ కుటుంబానికి చెందిన
పఠాన్ బిడ్డడికి సైన్యంలో బ్రిటీష్ అధికారులతో సమానంగా హోదా లభించేది. ఆ స్థాయి
హోదాను పొందడానికి పఠాన్ యువకులు ఉవ్విళ్ళూరేవారు. గఫార్ ఖాన్ కూడా సైన్యంలో
(Guides Mission) చేరారు. ఒక బ్రిటీష్ సైనికాధికారి మరొక పఠాన్ సైనికుని పట్ల
అగౌరవంగా ప్రవర్తించడం చూసి సహించలేని ఆయన, సైన్యం నుండి బయటికి వచ్చేశారు.
ఆ తర్వాత 1908లో ఆలీఘర్ వెళ్ళి విద్యాభ్యాసం చేస్తుండగా, రెవరెండ్ విగ్రాం ఆయనను
ఇంగ్లాండ్ వెళ్ళి చదవమని సలహా ఇచ్చారు. అందుకు ఏర్పాట్లు కూడా జరిగాయి. చివరకు
తల్లి అయిష్టత వ్యక్తం చేయటంతో ఆ ప్రయత్నం మానుకుని స్వగ్రామానికి వెళ్ళి
వ్యవసాయంలో గ్రామ వ్యవహారాల నిర్వహణలో తండ్రికి తోడ్పడసాగారు.
స్వగ్రామానికి తిరిగి వచ్చిన గఫార్ ఖాన్, ప్రజల పేదరికం, అవిద్యల మీద దృష్టి
సారించారు. విద్యా సౌకర్యాలు లేనందున పఠాన్లు ఎలా వెనుకబడుతున్నది, ఎంతటి
అజ్ఞానంలో మగ్గిపోతున్నది అధ్యయనం చేశారు. ఈ పరిస్థితులను మెరుగుపర్చడానికి నడుం
బిగించారు. విద్యలో వెనుకబాటుతనాన్ని ఎదుర్కొంటున్న స్వజనులకు విద్యా-వికాస
సదుపాయాలను కల్పించాలని సంకల్పించారు. మిత్రుడు అబ్దుల్ అజీజ్ సహకారంతో
1910లో ఉత్తమ జాయ్లో ' ఆజాద్ జాతీయ పాఠశాల ' ను ప్రారంభించారు. ఈ రంగంలో
అప్పటికే కృషిచేస్తున్న ప్రముఖ సంఘసంస్కర్త అబ్దుల్ వాహిద్ హాజీ అసాబ్ ప్రోత్సాహం
ఆయనకు లభించింది.
బిడ్డలకు విద్యాబుద్ధులు చెప్పటం వరకే గఫార్ ఖాన్ తన కార్యక్రమాలను పరిమితం
చేసుకోలేదు. పఠాన్ సమాజంలో చిట్లం కట్టుకుపోయి ఉన్న పగ - ప్రతీకారం, మూర్ఖత్వం
-మౌఢ్యం, అపరిశుభ్రత, అనారోగ్యం, పేదరికం లాంటి పలు రుగ్మతల వలన జాతి జనులు
ఏ విధంగా నష్టపోతున్నది పేర్కొంటూ, సంస్కరణల అవసరాలను వివరిస్తూ ఆ దిశగా
ప్రచారం ప్రారంభించారు. ప్రజలలో విద్యా-వికాసంతోపాటుగా సామాజిక సంస్కరణల
కోసం తగిన కార్యక్రమాన్ని, ప్రణాళికను తయారు చేసుకున్నారు. సంస్కరణల అవసరాన్ని
నొక్కి చెప్పారు.
పరంపరగా వచ్చే ఆచార సంప్రదాయాలకు అత్యధిక గౌరవమిచ్చే, పఠాన్ సమాజం
సంస్కరణలను సహజంగానే అంగీకరించలేదు. సంస్కరణలు పఠాన్ జాతి జనుల స్వభావానికి
వ్యతిరేకం. గఫార్ ఖాన్ నిరుత్సాహపడలేదు. దృఢచిత్తంతో ప్రచార కార్యక్రమాలను ముమ్మరం
చేశారు. ఆయన ప్రయత్నాలు ఫలించ సాగాయి. బానిసత్వంలో, అజ్ఞానంలో, అరాచకంలో
మగ్గుతున్న ప్రజానీకం తమ దుర్భర పరిస్థితులను, ఆ పరిస్థితులకు కారణాలను క్రమంగా
అర్ధం చేసుకుంటూ, గఫార్ ఖాన్ మార్గాన నడిచేందుకు సన్నద్ధం కాసాగారు. ప్రజలలో
చైతన్యపు ఛాయలు ప్రస్ఫుటం కాసాగాయి.
ఈ వాతావరణం అటు పాలకవర్గాలలో, ఇటు పాలకవర్గాల చెప్పుచేతల్లో ఉన్న
మౌల్వీలలో అసహనానికి కారణమైంది. ప్రజలు విద్యావంతులైతే తమ దాష్టీకాలు సాగవని
బ్రిటీషర్లు, తమ ఆధ్యాత్మిక-సాంఘిక పెత్తనం సాగదని భావించిన ధార్మిక గురువులు