Jump to content

పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సయ్యద్ నశీర్ అహమ్మద్ | 124

ఆటంకాలు సృష్టించారు. ఆటంకాలు సృష్టించిన పాలకులు, ధార్మిక నాయకులు, ప్రజల జీవితాలలో గుణాత్మక మార్పుకు తగిన ప్రత్యామ్నాయం చూడలేకపోవడంతో గఫార్ ఖాన్‌కు ఆ ఆటంకాలు అడ్డు కాలేకపోయాయి. ఈ వాతావరణంతో ఉత్సాహాన్ని నింపుకున్న గఫార్ ఖాన్, పఠాన్ యువతకు సమకాలీన రాజకీయాలను పరిచయం చేయడానికి, జాతీయ భావాలను ప్రోదిచేయడానికి చర్యలు తీసుకున్నారు. అలీఘర్‌లో పరిచయమైన మౌలానా జాఫర్ అలీ ఖాన్ సంపాదకత్వం వహిస్తున్న ‘జమీందార్’ దినపత్రిక, మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ సారథ్యంలోని ‘అల్-హిలాల్’ పత్రికలను పాఠశాలలకు తెప్పించి అధ్యయనం చేయించారు. ఈ పత్రికలు విద్యార్థులు, యువజనులలో రాజకీయ చైతన్యానికి తోడ్పడ్డాయి.
⁠యువకుడు గఫార్ విద్యా-వికాస కార్యక్రమాలంటూ, సంస్కరణలంటూ గ్రామాలు పట్టి తిరగడాన్ని తల్లిదండ్రుల ప్రేమ అర్థం చేసుకోలేకపోయింది. వివాహం చేస్తే ఇంటి పట్టున ఉంటాడని భావించి 1912లో గఫార్ ఖాన్‌కు పెండ్లి చేశారు. అదే సమయంలోనే గఫార్‌కు మార్గదర్శకంగా ఉన్న హాజీ అబ్దుల్ వాహిద్ సాహెబ్ బ్రిటీష్ పాలకుల మీద తిరుగుబాటు ప్రకటించారు. గత అనుభవాల దృష్ట్యా, వలసపాలనాధికారుల ఎత్తులకు ప్రభావితులైన పఠాన్ తెగల పెద్దలు, ధార్మిక నేతలు తిరుగుబాటుకు చేయూతనివ్వలేదు. గత్యంతరం లేక హాజీ సాహెబ్ పర్వత ప్రాంతాలలో అదృశ్యమైపోయారు. జాతి జనుల అభ్యున్నతిని కోరుతూ సాగుతున్న సంస్కరణల పర్వానికి మార్గదర్శకత్వం వహిస్తున్న హాజీ సాహెబ్ అదృశ్యం కావడంతో యువకుడు గఫార్‌ఖాన్‌కు మార్గదర్శకులు కరువయ్యారు.
⁠నిర్మాణాత్మక మార్గదర్శకత్వం కోసం గఫార్‌ఖాన్ ముస్లిం సమాజాన్ని చైతన్యవంతం చేస్తున్న నేతల వైపు దృష్టిసారించారు. 1913లో ఆగ్రాలో జరిగిన ఆల్ ఇండియా ముస్లింలీగ్ సమావేశాలకు, ఆ తరువాత దేవ్‌బంద్‌లో జరిగిన ముస్లిం ప్రముఖుల సమావేశాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యా-వికాస కార్యక్రమాలను, సంస్కరణలను కొనసాగించాలని, రాజకీయ చైతన్యానికి కృషి చేయాల్సిందిగా పలువురు నేతలు ఆయనకు సలహా ఇచ్చారు. ప్రముఖుల సలహాల మేరకు మరికొన్ని ప్రాంతాలలో ఆజాద్ పాఠశాలల స్థాపనకు గఫార్ ఖాన్ నడుం కట్టారు.
⁠అది 1914 సంవత్సరం. ప్రథమ ప్రపంచ యుద్ధకాలం నాటి కిరాతక చట్టాలను ప్రభుత్వం అమలుచేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక భావాల ఉనికిని కూడా పాలకులు సహించలేకున్నారు. ఆ పరిస్థితులలో అధికారుల చూపు ఆజాద్ పాఠశాలల మీద పడింది. రాజకీయ, సాంఘిక చైతన్యానికి కారణమవుతున్న పాఠశాలలను మూసివేయడానికి అధికారులు హుకుం నామాలు జారీచేశారు. స్థానిక సర్దార్‌లను మాలిమి చేసుకుని, బెదిరించి కొన్ని పాఠశాలలను మూసి వేయించారు. ఆ వాతావరణంలో కూడా నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తూ, గఫార్ ఖాన్ విస్తృతంగా పర్యటనలు ప్రారంభించారు. జాతి జనుల అభ్యున్నతిని వాంఛిస్తున్న గఫార్ ఖాన్ నిబద్ధతను, ధైర్యసాహసాలను గమనించిన ప్రజలు ఆయనను ‘బాద్షా ఖాన్’ అంటూ గౌరవాభిమానాలను ప్రకటించారు. బాద్షా ఖాన్ అంటే ఖాన్‌లకు రాజు. ఖాన్ అంటే నేతయని అర్థం. ఈ విధంగా యువకుడైన అబ్దుల్ గఫార్ ఖాన్, ఖాన్‌లకే ఖాన్ బాద్షాఖాన్ అయ్యాడు. ఆ సమయంలోనే ఆయన కార్యక్రమాలను మౌనంగా సమర్థించిన