పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/9

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నా మాట...

భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లింల పాత్రను ప్రజలకు తెలుపాలన్న ఉద్దేశ్యంతో 1999లో భారత స్వాతంత్య్రోద్యమం: ముస్లింలు సుదీర్గ వ్యాసం రాశాను.ఆ వ్యాసం గీటురాయి వారపత్రికలో ధారావాహికంగా ప్రచురితమైంది. ఈ వ్యాసం, ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌ ఛైర్మన్‌, హాజీ షేక్‌ పీర్‌ అహమ్మద్‌ గారి ప్రోత్సాహంతో పుస్తక రూపం తీసుకుంది. అప్పటికి నాకు అందుబాటులో ఉన్నసమాచారం,చిత్రాలతో భారత స్వాతంత్య్రోద్యమం: ముస్లింలు ప్రచురితమైంది. ఈ చిన్న పుస్తకాన్ని పెద్ద మనస్సుతో పాఠకులు ఆదరించారు. పత్రికలు చక్కని సమీక్షలతో ప్రజలకు పరిచయం చేశాయి. ఆ తరువాత 2003 ఆగస్టులో మంగళగిరికి చెందిన తక్షశిల ప్రచురణలు అధినేత రేఖా కృష్ణార్జునరావు గారు, ఈ పుస్తకాన్ని యథాతధంగా పునర్ముద్రించారు. భారత సాfiతంత్య్రోద్యమంలో ముస్లింల మహోన్నత పాత్రను పదిమందికి తెలిపి, ప్రజలలో సద్భావన-సదవగాహన ఏర్పర్చాలన్నఉదేశ్యంతో ఈ పుసకాన్ని చాలా వరకు ఉచితంగా పంపిణి చేయించి తన మంచి మనస్సును చాటుకున్నారు.

ప్రస్తుతం తెలుగు ఇస్లామిక్‌ పబ్లికేషన్స్‌ సంచాలకులు జనాబ్‌ అబ్బాదుల్లా ఆనాటి పుస్తకాన్ని సరికొత్తగా ప్రచురించదలిచారు. అందుకు నూతన సమాచారం,నూతన చిత్రాలు, ఫొటోలు సమకూర్చాలని ముందస్తు షరతు విధించారు.ఆ షరతును ననుసరిస్తూ చరిత్ర ఆధ్యాపకులు, పరిశోధకులు, పాఠకుల సూచనలను వీలయినంతగా పాిటిస్తూ, ప్రస్తుతం మీ చేతుల్లో ఉన్న పుస్తకాన్ని తిరగరాశాను. ఈ పుస్తకంలోని సమాచారాన్ని తొలినాటి పుస్తకంతో పొల్చినట్టయితే నూతన సమాచారం, నూతన చిత్రాలు,ఫొటోల కారణంగా పరిమాణంలో ద్విగణీకృతమై సరికొత్త పుస్తకమయ్యింది. ఈ కృషిలో నాకు సహకారం అందించిన తెలుగు ఇస్లామిక్‌ పబ్లికేషన్స్‌,సంచాలకులు జనాబ్‌ అబ్బాదుల్లా గారికి, పరిచయ వాక్యం రాసిచ్చిన స్వాతంత్య్ర సమరయోధులు,విశాలాంధ్ర దిన పత్రిక విశ్రాంత సంపాదకులు శ్రీ పరకాల పట్టాబిరామారావు గారికి మిత్రులు జనాబ్‌ వాహెద్‌ (గీటురాయి) గారికి, చక్క ని చిత్రాలు గీసిచ్చిన ప్రముఖ చిత్రకారులు షేక్‌ అబ్దుల్లా (విజయవాడ) గారికి, నా ప్రతి ప్రయత్నం వెనుక తానుండి సతతం నన్ను ప్రొత్సహిస్తున్న నా జీవిత భాగస్వామి శ్రీమతి రమిజా బానుకు, నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక ఈ గ్రంథం గురించి తీర్పు చెప్పాల్సింది పాఠకులే !

- సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌, వినుకొండ, ఏప్రిల్‌ 2006.

6