పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/564

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

ఈలక్ష్మీశతకమును రచించినది పరవస్తు మునినాథకవి. ఈతఁడు సాతానివైష్ణవుఁడు. శతకములోని 7-8 పద్యములలోని ప్రశంసవలన నీకవి శేషమఠపీఠాధీశుఁ డగుజియ్యరుమహేంద్రుని కృపాకటాక్షమున అష్టావధానప్రజ్ఞయుఁ గవితానైపుణ్యమును బొందినటుల దెలియుచున్నది. ఈ కవిపుంగవుఁడు నిజాము రాష్ట్రనివాసి. ఏగ్రామవాస్తవ్యుఁడో యేకాలపువాఁడో నిరూపించుటకు వలయు నాధారము లీశతకమున గాన్పించుటలేదు. శతకవైఖరింబట్టి చూడ నీకవి ప్రబంధరచనాసముఁడనియును మిక్కిలియాధునికకవియనియును దోఁచెడిని. రసజ్ఞుఁ డగు నీరచయిత గ్రంథరత్నము లెన్ని కాలగర్భమున నిమిడియున్నవో కదా! కవిసోదరుల పరిశోధనమువలన దక్కుంగల గ్రంథములు లభించునని యాశించియున్నాఁడ. శతకకవులచరిత్ర గూడ నీకవితల్లజుని బేర్కొనియుండలేదు.

ఇది యొకభక్తిరసస్ఫూరిత మగు నొక చిన్నిశతకరత్నము, దీనియందు నూటరెండుకందపద్యములు గలవు. కవి శతకాంతమునఁ దనను మత్తేభవృత్తమునఁ బ్రశంసించికొనియున్నాఁడు.