పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/565

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

550

ఇందలికవిత్వము నిర్దుష్టముగ ద్రాక్షాపాకముతో నాతికాఠిన్యముగా నున్నది. పద్యములయందు శబ్దాలంకారములగు వృత్త్యనుప్రాసము, అంత్యప్రాసము లోనగునవి యుంటచేఁ జదువుటకును వినుటకును గూడ నింపుగానున్నవి. ఈకవిచే రచియింపఁబడిన మఱియొకశతకము "లలితాశతకము”. దానిని విమర్శించితిమిగాని శతకరచయితం గూర్చి యింతకన్న నెక్కుడుగా దెలిసికొనుట కాధారము లేమియు నందు లభింపలేదు. అనర్గళమగు కవితాధారతో భావములను సైతము మించెడు చక్కనిపదగుంఫనలతో నీశతకరత్నమును రచించి యాంధ్రభాషాసరస్వతికి నూతనశోభను గలిగించిన యీ యష్టావధాని కడుస్తుతిపాత్రుఁడు.

ఈయముద్రితశతకమునకుఁ బ్రత్యంతరము వ్రాసియు నత్యవసరమగు మఱికొన్నిభాషావిషయికకార్యంబుల నుంటచే దయతో నాకు దీనికి బీఠిక వ్రాయు నవకాశ మొసంగిన శ్రీమాన్ శేషాద్రిరమణకవులయెడను శతకసంపుటప్రకటనకర్తలగు బ్రహ్మశ్రీ వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రిగారియెడను గృతజ్ఞుఁడను.

నందిగామ

భాషాసేవకుఁడు

1-6-26

కొణతాలపల్లి సత్యనారాయణ