పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/484

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

41. క. ఘోరతర కర్మవాసన
లేరీతిని జుట్టి పట్టి హీనులఁ జేయన్‌
మీఱిన యజ్ఞానుల కది
భారంబో శివముకుంద పరమానందా.

42. క. వేషములవలన జనులఁ బ్ర
మోషించి మనీషివరుల మోదము జెఱిచే
దూషకులఁ గూడి పెద్దలు
భాషింపరు శివముకుంద పరమానందా.

43. క. అచ్చట నచ్చట నేర్చిన
తచ్చన లొక కొన్ని యఱచి తత్త్వం బని తా
మెచ్చిన నేమగు మాటల
పచ్చ ళ్లది శివముకుంద పరమానందా.

44. క. అలయంగ భూమి నుదధి
స్థలి కృష్ణనివాసమైన ద్వారక నడుమన్‌
లలిఁ దను గను శివయోగియె
బలవంతుఁడు శివముకుంద పరమానందా.

45. క. నెల ప్రొద్దులోన గట్టిగ
నెలకొని చూడంగ వలయు నీలజ్యోతిన్‌
వెలి లోను గానిచూపున
బలిబంధన శివముకుంద పరమానందా.

46. క. పరకార్యపరులు లోకులు
పరమజ్ఞానులు స్వకార్యపరు లై ధరలో
నిరతిశయసుఖముఁ గాంతురు
పరమాత్మా శివముకుంద పరమానందా.

47. క. మేటైన బ్రహ్మవిద్యకు
సూటై తగు రాజయోగసుస్థిరు లెచటన్‌
బూటకపు మంత్రవిద్యలఁ
బాటింపరు శివముకుంద పరమానందా.