పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/483

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34. క. అవిరళతత్త్వం బెఱిఁగెడు
సువిచారం బొకనిపాలిసొమ్మా మనుజుం
డెవఁడైన నేమి తెలివికి
భవమోచన శివముకుంద పరమానందా.

35. క. ఏపాటు లేక తనలోఁ
జూపట్టుచు వెలుఁగుచుండు సూక్ష్మబ్రహ్మం
బేపారఁగఁ దెలియ రయో
పాపాత్ములు శివముకుంద పరమానందా.

36. క. శాంతంబై పూర్ణంబై
యెంతయు బ్రహ్మంబు తెలివి కేర్పడ మాయా
క్రాంతముగా మదిఁ దలఁచుట
భ్రాంతిగదా శివముకుంద పరమానందా.

37. క. పోషించి తత్త్వరచనల
భాషించినఁ దెలియ లేక పామరమతు లై
దూషణ చేతురు కొందఱు
పాషండులు శివముకుంద పరమానందా.

38. క. మెండుకొనుతత్త్వవాసన
లుండదు పరిపక్వహృదయమొగిఁ గాకుంటే
యెండిన కసుగా యైనది
పండౌనా శివముకుంద పరమానందా.

39. క. పుట్టించని సుద్దులు చెవిఁ
బెట్టిన నది లెస్సగాక పిమ్మట ధరలోఁ
బుట్టించెడు సుద్దులఁ జెవిఁ
బట్టుదురా శివముకుంద పరమానందా.

40. క. వారక సంసారంబునఁ
బోరాడిన నేమి విరతిఁబొందిన నేమీ
యారూఢ యోగి కది వ్యా
పారంబో శివముకుంద పరమానందా.