పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/467

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48. ఎవ్వరైనను బరమార్థ మిట్టి దనుచు
తెలియనేర్తురె తమలోన తేటపడఁగ?
నుత్తమజ్ఞాని శివయోగి యుండుఁ గాక,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

49. స్నానమొల్లఁడు, దేవతార్చనము సేయఁ
డమల విజ్ఞానసంపన్నుఁ డైనయోగి;
లోకులకుఁ దెల్సునే వానిలోనిగుట్టు?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

50. తమనిజం బేమి యెఱుఁగరు ధాత్రిజనులు;
మృచ్ఛిలాకాష్ఠతామ్రనిర్మితములైన
దేవతలఁ గొల్చువాఁ డెట్లు తెలియనేర్చు?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

51. ఱాళ్లఁ జేసిన వొకకొన్ని రాగికొన్ని,
మ్రానఁ జేసిన వొకకొన్ని, మంటిఁ గొన్ని;
యిట్టిదేవుళ్ళు ముక్తీయ నెట్లు నేర్తు?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

52. మండలాంతర దేదీప్యమాను శివుని
మూఁడు నాలుగు పాఁతల ముడిచి ముడిచి
యఱుతఁ గట్టుదు రొకకొంద ఱల్పమతులు,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

53. కులము రూపును గుణమును గూలఁబెట్టు
నరుఁడు శివయోగివిద్యలు మరగెనేని;
చెడ్డసంసార మైతేను చెప్పనేల?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

54. బ్రహ్మవిద్యకుఁ దనయింటి ప్రజలు చాల
సమ్మతించిన గృహమందె సలుపవలయు;
నట్లు గాకున్న మఱి యింటియాస లేల,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.