పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/468

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

55. మనుజమాత్రుండె శివయోగి మహితకీర్తి
యఖిలజగములు తానైన యట్టివిధము
దృష్టముగఁ జూచు ననుభవదృష్టిచేత
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

56. పరమసుజ్ఞాననిధిఁ జూచి పాపజనులు
దమకు సరియైనవారుగాఁ దలఁతు రెపుడు
వారు గన నేరరెట్టి నిర్వాణమహిమ
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

57. కట్టఁగావచ్చు మృదువైన కావికోకఁ
బెట్టఁగావచ్చుఁ బాదుక లెట్టివైనఁ
బట్టఁగారాదు మనసింత పాఱనీక
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

58. కూడు దినరాదటంచును గొందఱయ్య
లేలకో వెఱ్ఱిత్రోవల నెఱుఁగలేరు
కూడు విడిచిన విడుచునా కుటిలబుద్ధి
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

59. పాలు నీరును నొక్కటై పరిణమించు
కరణి బ్రహ్మంబులో మాయ గలసియుండు
చారు శివయోగి తెలియు హంసంబు పగిది
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

60. నిత్యనైమిత్తికాదులు నెఱపకున్న
పాతకం బని వెఱచునే పరమయోగి?
పోతురాజుకు నేల నీభూతశంక?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

61. ఊరు మేలైన నుండును యోగివరుఁడు;
తోడు మేలైన బోవును తోడుతోనె;
వాని కెక్కడ లోకంబువారి నడత?
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.