పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తే. నలుగురికి మెప్పుగానైన నడువ లేదు
నళినదళనేత్ర! నిన్ను నే నమ్మినాను
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 61

సీ. అతి లోభులను భిక్షమడుగ బోవుట రోఁత
తన ద్రవ్య మొకరింట దాఁచ రోఁత
గుణహీనుఁడగు వాని కొలువుఁ గొల్చుట రోఁత
యొరుల పంచల క్రిందనుండ రోఁత
భాగ్యవంతులతోఁడ బంతమాడుట రోఁత
గుఱిలేని బంధులఁ గూడ రోఁత
ఆదాయములు లేక యప్పుదీయుట రోఁత
జార చోరులఁ గూడ చనుట రోఁత
తే. యాదిలక్ష్మీశ! నీ బంటు నయితినయ్య
యింక నెడబాపు జన్మంబులెత్త రోఁత
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 62

సీ. వెఱ్ఱివానికి నేల వేదాక్షరంబులు?
మోటువానికి మంచిపాట లేల?
పసులకాఁపరి కేల పరతత్త్వబోధలు? విటకాని కేటికో విష్ణుకథలు?
వదరు శుంఠల కేల వ్రాఁత పుస్తకములు?
తిరుఁగు ద్రిమ్మరి కేల దేవపూజ?
ద్రవ్యలోభికి నేల దాతృత్వ గుణములు?
దొంగబంటుకు మంచిసంగ తేల?
తే. క్రూరజనులకు నీమీఁద గోరి కేల?
ద్రోహి పాపాత్మునకు దయాదుఃఖ మేల?
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 63