పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇనజభటావళి యీడిచి కొనిపోక
కరుణతో నా యొద్దఁ గావలుంచు
తే. కొసకు నీ సన్నిధికిఁ బిల్చుకొనియు నీకు
సేవకునిఁ జేసికొనవయ్య శేషశయన!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 59

సీ. నీకు దాసుఁడ నంటి నిన్ను నమ్ముకయుంటిఁ
గాన నాపై నేఁడు కరుణఁజూడు
దోసిలొగ్గితి నీకు ద్రోహ మెన్నఁగఁబోకు
పద్మలోచన! నేను పరుఁడగాను
భక్తి నీపై నుంచి భజనఁ జేసెదఁ గాని
పరుల వేఁడను జుమ్మి వరము లిమ్ము
దండిదాతవు నీవు తడవు సేయక కావు
ఘోరపాతకరాశిఁ గొట్టివైచి
తే. శీఘ్రముగఁ గోర్కె లీడేర్చి చింత దీర్చు
నిరతముగ నన్ను బోషించు నెనరు నుంచు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 60

సీ. విద్య నేర్చితి నంచు విఱ్ఱవీఁగఁగ లేదు
భాగ్యవంతుఁడ నంచు బలుక లేదు
ద్రవ్యవంతుఁడ నంచు దఱుచు నిక్కఁగ లేదు
నిరత దానములైన నెఱప లేదు
పుత్రవంతుఁడ నంచు బొగడించుకొన లేదు
భృత్యవంతుఁడ నంచు బొంగలేదు
శౌర్యవంతుఁడ నంచు సంతసించగ లేదు
కార్యవంతుఁడ నంచు గడపలేదు