పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పెట్టలేనంటివా పిన్న పెద్దలలోనఁ
దగవు కిప్పుడు దీయఁ దలఁచినాను
ధనము భారంబైనఁ దల కిరీటము నమ్ము
కుండలంబులు పైఁడిగొలుసు లమ్ము
తే. కొసకు నీ శంఖచక్రముల్‌ కుదువఁబెట్టి
గ్రాసము నొసంగి పోషించు కపటముడిగి
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర!

సీ. కువలయశ్యామ! నీకొలువు చేసిన నాకు
జీత మెందుకు ముట్టఁజెప్పవైతి
మంచిమాటలచేతఁ గొంచెమియ్యఁగలేవు
కలహమౌ నిఁకఁ జుమ్మి ఖండితముగ
నీవు సాధువు గాననింత పర్యంతంబు
చనవుచే నిన్నాళ్ళు జరుపవలసె
నిఁక నేసహింప నీవిపుడు నన్నేమైన
శిక్ష చేసినఁ జేయు సిద్ధమైతి
తే. నేఁడు కరుణింపకుంటివా నిశ్చయముగఁ
దెగఁబడితి చూడు నీ తోడ జగడమునకు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర!

సీ. హరి! నీకుఁ బర్యంకమైన శేషుడు చాలఁ
బవనము భక్షించి బ్రతుకుచుండు
ననువుగా నీకు వాహనమైన ఖగరాజు
గొప్పపామును నోటఁ గొఱుకుచుండు
యదిగాక నీ భార్యయైన లక్ష్మీదేవి
దినము పేరంటంబు దిరుగుచుండు