పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74. సీ. విశ్వసృష్టివి నీవు విశ్వేశుఁడవు నీవు
విశ్వవంద్యుఁడ వీవు విశ్వ మీవు
వేదవేద్యుఁడ వీవు బేదాంతకుఁడ వీవు
వేదస్థుఁడవు నీవు వేద మీవు
యజ్ఞకర్తవు నీవు యజ్ఞభోక్తవు నీవు
యజ్ఞరూపుఁడ వీవు యజ్ఞ మీవు
వేదవేద్యుఁడ వీవు వేదాత్మకుఁడ వీవు
దైవజ్ఞుఁడవు నీవు దైవ మీవు
గీ. శిష్యుఁదవు నీవు పరమదేశికుఁడ వీవు
సగుణనిర్గుణములు నీవు సాక్షి నీవు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.

-: పంచభూతములైక్యనిర్ణయము :-
75. సీ. అవని నీరంబులో నైక్యంబుగాఁజేసి
యానీర మగ్నిలో నైక్యపఱచి
నాయగ్ని వాయువం దైక్యంబుగాఁజేసి
యావాయు గగనమం దైక్యపఱచి
గగనంబు మహదహంకారంబులోఁ గల్పి
తదహంకృతియు మహాతత్వమందు
నైక్యంబుగాఁజేసి యామహాతత్వంబు
నద్వయబ్రహ్మమం దైక్యపఱచి
గీ. నట్టి యోగీంద్రుఁ డద్వయుం డప్రమేయుఁ
డప్రమత్తుఁ డనంతుండు నఖిలసముఁడు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.