పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

-: జ్ఞానియగు లక్షణము :-
76. సీ. బ్రహ్మందాత్మైక్యభావంబు దెలిసిన
నజ్ఞానవృత్తులు నణఁగుచుండు
నజ్ఞానవృత్తులు నణిఁగిన పిమ్మట
నవివేకవృత్తులు నణఁగుచుండు
నవివేకవృత్తులు నణఁగిన పిమ్మట
నభిమానవృత్తులు నణఁగుచుండు
నభిమానవృత్తులు నణఁగిన పిమ్మట
రాగాదులెల్ల విరాగమౌను
గీ. రాగములు బోయినప్పుడు కర్మములు దొలఁగు
కర్మములు బోవ నిర్మలజ్ఞాని యగును
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.

-: ప్రజ్ఞానం బ్రహ్మయనే శక్తి లక్షణము :-
77. సీ. శ్రవణేంద్రియములశబ్దము ల్వినుచుండు
చర్మేంద్రియంబున స్పర్శనెఱుఁగు
చక్షురింద్రియముల వీక్షించు రూపముల్
రూఢిగా జిహ్వచే రుచుల నెఱుఁగు
ఘ్రూణరంధ్రంబుల గంధమాఘ్రాణించు
వాక్కున వచియించు వాక్యములను
యేజ్ఞానమున నిన్నియ్ర్ఱిఁగె నాజ్ఞానంబు
ప్రజ్ఞానమని శ్రుతు ల్బలుకుచుండు
గీ. నట్టిప్రజ్ఞానలక్ష్యార్థ మనుభవంబు
నీస్వరూపంబు నిక్కంబు నిజముగాను
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.