పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

-: ఆధారచక్రనిర్ణయము :-
54. సీ. ఆసనస్థానమం దాధారచక్రము
నందు నాలుగురేకు లమరియుండు
వశషస లనుయెడివర్ణము ల్నాల్గుండు
నర్ధచంద్రాకార మమరియుండు
కుంకుమవర్ణంబు కింకిణీనాదంబు
నార్నూరుహంసలు నాడుచుండు
సద్భక్తియును క్రియాశక్తియు వర్తించు
ఘనతరంబున నన్ని గలిగినట్టి
గీ. కమలమందున బ్రేమతో విమలమైన
నీవు గణపతిరూపమై నిలచినావు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.

-: స్వాధిష్ఠానచక్రనిర్ణయము :-
55. సీ. ఆధారమునకు రెండంగుళాలకుమీద
రంగస్థలం బుండు రంగుగాను
స్వాధిష్ఠచక్రము షడ్దళంబులఁ ద్రికో
నాకారమై యందు నమరియుండు
బభమయరల లుండు పాటిల్లు నైష్ఠిక
భక్తి వీరము జ్ఞానశక్తి యుండు
విమలవిద్యుత్కాంతి వీణారవంబును
నార్వేలుహంసలు నాడుచుండు
గీ. ప్రకటితంబుగ వికసితపద్మ ముండు
నీవు బ్రహ్మస్వరూపమై నిలచినావు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.