పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

-: మణిపూరకచక్రనిర్ణయము :-
56. సీ. మఱియు నాభిస్థానమణిపూరకం బది
దశదళంబులతోడ దనరియుండు
డఢలాదిఫాంతముదృఢతనక్షరములు
పది వేణునాదంబు ప్రబలియుండు
శ్యామలవర్ణ మిచ్ఛాశక్తి షట్కోణ
మగ్నిభూతంబు రా నంటియుండు
నవధానభక్తియు నచట కుందలిమీద
నార్వేలహంసలు నాదుచుండు
గీ. నిన్నయుండినచక్రమం దిష్టముగను
నీవు విష్ణురూపమై నిలచినావు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.

-: అనాహతచక్రనిర్ణయము :-
57. సీ. హృదయస్థలమ్మునం దిరవై యనాహత
పద్మమందున దళాల్ పదియు రెండు
కఖగాదిపాంతము ఘనతరాక్షరములు
పదిరెండుయుండును బాగుగాను
వర్తులాకారము వాయుభూతము నాది
శక్తియుండును భవభక్తి యుండు
శతకుంభపుకాంతి శంఖారవంబును
నార్వేలహంసలు నాడుచుండు
గీ. భరితమై యున్నచక్రాధిపత్యముగను
నీవు రుద్రస్వరూపమై నిలచినావు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.