పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

-: చతుర్దశేంద్రియవిషయములు :-
20. సీ. శబ్దంబు చెవులకు స్పర్శ చర్మంబున
కక్షికి రూపు జిహ్వకు రసంబు
ముక్కుకు గంధంబు వాక్కుకు వచనంబు
కరమున దానంబు చరణములకు
గమనంబు గుదమునకు గలుగు విసర్జన
గుహ్యము కానందగుణము గలుగు
మనసు చలించును మతి నిశ్చయించును
చిత్తంబుఁ జింతించు మొత్తముగను
గీ. మఱి యహంకారన కభిమానపడును
నిన్నిటెఱిఁగిన తెలివి దా నెఱుఁగవలయు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.

-: చతుర్దశేంద్రియములకు అధిదేవతలు :-
21. సీ. శ్రవణంబులకును దిక్చర్మంబునకు వాయు
చక్షువులకు జగచ్చక్షు వరుణుఁ
డును జిహ్వకును ఘ్రూణమున కశ్వినీసుతు
ల్వాగీంద్రియమునకు వహ్నిహస్త
ములకు నింద్రుడు పాదములకు నుపేంద్రుండు
గుదమును మృత్యువు గుహ్యమునకు,
చతురాననుడు మానసమునకు జంద్రుండు
బుద్దికి పరమేష్ఠి శుద్ధచిత్త
గీ. మునకు జీవుం డహంకారమునకు శివుఁడు
తెలియవలె నీచతుర్దశదేవతలను
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.