పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

-: సప్తధాతువులనిర్ణయము :-
18. సీ. మఱి రసరుధిరము ల్మాంసము మేదస్సు
మజ్జాస్థిరేతస్సుమానితముగ
నివి సప్తధతువు ల్నిబిడీకృతంబుగా
దేహికావరణంబు దేహమాయ
పాదాదిమస్తకపర్యంతమును నిండి
ప్రకృతిభేదంబుల ప్రబలమాయ
స్థూలమై దీర్ఘమై సూక్ష్మమై నటియించి
యందెందు మరణంబు జెందుచుండు
గీ. నిట్టి దేహంబులం దాస లేమిలేక
నిన్ను గనువాడు మునిజనసన్నుతుండు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.

-: శరీరత్రయలక్షణము :-
19. సీ. జ్ఞానేంద్రియంబులు కర్మేంద్రియంబులు
నంతరింద్రియవిషయేంద్రియములు
ప్రాణాదులనుగూడి పరగ నిర్వదియాఱు
తత్త్వంబులను స్థూలతనువు నయ్యె
బాహ్యేంద్రియంబులు పదిప్రానములు నైదు
ధీమనంబుల సూక్ష్మదేహ మయ్యె
నీశరీరద్వయహేతువై యాద్యవి
ద్యాశ్రుతమై కారణాంగమయ్యె
గీ. మూఁడుదేహంబులకు నాదిమూలమైన
క్షరున కక్షరునకు విలక్షణుఁడ వీవు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.