పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

-: పంచభూతలక్షణము :-
10. సీ. వసుధాజలం బగ్ని వాయు వాకాశంబు
లివి పంచభూతము ల్వీనియందు
రక్తశుభ్రాసితయుక్తధూమ్రసునీల
ములు గంధరసరూపములను స్పర్శ
శబ్దంబులును గ్రియాశక్తి జ్ఞానేచ్ఛాది
శక్తులు పరపరాశక్తు లమర
నాయుజవిష్ణువు త్ర్యంబకేశ్వరసదా
శివులు నొండొంటికి స్థిరముగాను
గీ. వర్ణగుణశక్తి బీజదేవతలు నుండు
నీకు నే గుణములు లేవు నిర్మలుఁడవు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.

-: పంచభూతగుణములు :-
11. సీ. రూఢిశబ్దస్పర్శరూపముల్ రసగంధ
ములు నైదు పృధివియందమరియుండు
స్ప్ర్శరసమురూపశబ్దము ల్నాగును
జనితమై జలమారు చెలఁగియుండు
నగ్నిహోత్రమునందు నమరి రూపస్పర్శ
శబ్దము ల్మూఁడు నిశ్చయముగాను
వాయు వందస్పర్శవరశబ్దములు రెండు
నంబరం బందు శబ్దంబు నొకటి
గీ. యొక్కటియు లేక దిక్కులు పిక్కటిలఁగ
వెలుగుచున్నావు లోపల వెలుప లనక
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.