పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

-: నరప్రమాణసూత్రము :-
8. సీ. నరుఁడు తొంబదియాఱు నంగుళా లెనిమిది
జేనలపొడవునా ల్జేనలెళుపు
నిట్లు ముప్పదిమూఁడుకోట్లరోమంబులు
వెలయు డెబ్బదిరెండువేలనాళ్ళు
నెముక లఱువదియాఱు నమరు తొంబది రెండు
కీళ్ళు ముప్పదిమూఁడు మూళ్ళప్రేగు
సేరుగుండెలు నర్ధసేరును రుధిరంబు
మణువు నాలుగుసేర్లు మాంసముండు
గీ. సోలపైత్యంబు శ్లేష్మ మరసోలె డుండు
నీప్రకారంబు దేహంబు లెంచిచూడ
జంతుజాలంబు లాయె నీజగతియుగము
లాయె నీరీతిఁ బరమాత్మ మాయవలన
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.

-: తొంబదియారుతత్త్వములు :-
9. సీ. జ్ఞానేంద్రియము లైదు కర్మేంద్రియము లైదు
శబ్దాదు లైదు కోశంబు లైదు
కరణము ల్నాల్గు రాగాదు లెన్మిది పది
నాళ్ళు వాయువులు పద్నాల్గు నేడు
థాతువు లైదు భూతము లాఱు చక్రాలు
మలముల మూఁడవస్థలును నైదు
మూఁడుమందలములు మూఁడీషణంబులు
మూఁడువ్యాధులు గుణా ల్మూఁడు రెండు
గీ. తనువులనుగూడి షణ్ణవీత్యాదితత్వ
సాక్షిరూపుఁడవైనావు సత్యముగను
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ.