మన కందఱకును సామాన్యముగా - తెల్లవారు కాలిడకముం దిచట నెందరు రాజులుండిరి? ఇచట ఏలుబడి ఎటులున్నది . ఇచటి ప్రజ యెట్టిది? ఇది యడవి దేశమా అన్యమా? ఇంగ్లీషువారు భుజబలముననే హిందూదేశమును జయించిరా ? తెల్లవారు కొల్లగొట్టిన ధనరాశి ఎచట మూల్గుచున్నది? మ్యూటినీలు ఏలవచ్చెను? కిరస్తానీమత మెటులు చొచ్చెను? అని యిటులు ప్రశ్న లనంతముగా తోఁచును. వీనికన్నిటి కీ పుస్తకమున సరియగు ప్రత్యుత్తరములు మనము పడయఁగలము.. ఇవికాక పంచాయతీల వినాశనము, బ్రిటిష్ వారి న్యాయవిచారణ, నూజవీడు అయోధ్య హైదరాబాదా బాకీలు, భూస్వామిత్వము, జమీందారీ రైతువారీ పద్దతులు, శిస్తులు, మిషనరీలు, గాజుల లక్ష్మీనరుసుగారు జాన్ బ్రూస్ నార్టను, ఉద్యోగములు, కాంగ్రెసు మొదలగు వజ్రశకలము లెన్నియోగనులనుండి యెత్తఁబడి ఇందు ఉల్లేఖింపఁబడినవి. 'కాసటబిసటే చదివి గాథలు త్రవ్వు తెనుంగువారికి' ఈ గ్రంథము ప్రామాణిక మేకాక అభిరుచికి గూడ కాణాచి. .
అమృతాంజనముతోఁ గాని కాఫీతోఁగాని పనిలేకుండ ఒకగుక్కలో ఈ చరిత్రము నంతయు చదువఁగలిగించిన శ్రీ దిగవల్లి శివరావుగారు అభినందనీయులు.
వేలూరి శివరామశాస్త్రి
బెజవాడ,
ది 28 - 9 - 38.