అసత్యము దాఁగదుగద .సత్యము లన్నియు పుంఖాను పుంఖములుగా బయటఁబడుచున్నవి. విశేషించి ఆంగ్లేయుల నోటినుండియే యివి వెలువడుచున్నవి. అట్టి సత్యముల పుట్టయే ఈ "బ్రిటిష్ రాజ్యతంత్ర యుగము!"
ఈ ప్రమాణములు పోవుచేయుటకు శ్రీ దిగవల్లి శివరావు గారి కెన్నియో యేండ్లు పట్టియుండును. వీ రిందుల కెన్నియో గ్రంథములు చదివియుందురు. తేనెపెర 'పెట్టుటకు తేనెటీఁగ కెంతకాలము పట్టునో అది యెన్నెన్ని పూలబడి తిరుగాడునో యెవరి కేమీపట్టె? ఎవరికిని తేనెపెరమీఁద నే పెర పెర. అట్టి తేనె పెర ఈ గంథము.
కుంఫిణీవారు హిందూదేశమును స్వాహాచేయువఱకును ఇచట పలువురు రాజులు నక్షత్రములవలె వెదఁజల్లఁబడినటు లుండిరి. వీర లందఱతోడను వీరి ప్రజలతోడను వీరి ధనముతోడను గల సంబంధమే యీ గ్రంథము. కావున నిది కలగూర గంపవలెను కప్పల తక్కెడవలెను ఉండక తప్పదు.
ఇచట నొకొక్క రాజున కొకొక్క చరిత్రయు ఒకొక్క దేశమున కొకొక్క రాజనీతియుకలదు. ఇట్టి రాజులు పలువురు. ఇట్టి నీతులు పెక్కు, ఇట్టి హిందూ దేశచరిత్ర మొక మహారణ్యము. శ్రీ దిగవల్లి శివరావుగారు దివ్వెబూని ఈ యరణ్యమున నడచుచు నడుమ నడుమ మనకు పూవులను కాయలను పండ్లను గోసియిచ్చి మనలను నడిపించుచు తీసికొనిపోవు చున్నారు.