పుట:బేతాళపంచవింశతి.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


.

దేవగణపరివృతుడై పరమేశ్వరుం డచ్చోటు కవధరించి వచ్చి విక్రమసేనుం గరుణార్ద్రదృష్టిం జూచిన నీవు నాయంశంబున సోమకులంబునందు విక్రమాదిత్యుండవై పుట్టు యిప్పుడు విక్రమసేనుండను బ్రఖ్యాతి కెక్కి రాజవంశభూషణుండవైతివి. భోగాపవర్గసుఖంబైన విద్యాధరరాజ్యపదవిం బొందుమను వరం బిచ్చి యంతర్హితుండయ్యె నంత.


ఉ.

ఆధరణీశ్వరుండు త్రిపురారివరంబున జేసి యప్డు వి
ద్యాధరచక్రవర్తి విభవాతిశయంబున దేజరిల్లి వి
ద్యాధరులెల్ల విభవాధితుడై పురి కేగుదెంచి ల
క్ష్మీధరమూర్తి రాజ్యము సమృద్ధిగ జేయుచు నుండె నున్నతిన్.


శా.

పాతాళంబున బన్నగేశ్వరపణాప్రవ్యక్తరత్నప్రభన్
భాతంబై మణినోత్కరామలరుచుల్ భూమండలిం బూరితం
బై తారాపథమం దుదారత సముద్యత్కాంతి శోభిల్లి వి
ఖ్యాతిన్ విక్రమసేనుకీర్తి యమరెన్ గంగాప్రవాహాకృతిన్.


క.

అని యావిప్రుఁడు నాకున్
వినగా బేతాళుపంచవింశతికథ లిం
పొనర నెరిగించి యంతయు
ననునయపూర్వకసమంద్రమతి దయ నిచ్చెన్.


వ.

అట్లు సిద్ధమంత్రప్రభావంబునం జేసి బేతాళుని వాహనంబుగా నొనరించి తత్ప్రభావంబున నతిగుహాగహనంబులు గడచి పుణ్యంబునం జేసి సపరివారుండై నిన్నుం గంటునని మృతుండయ్యెను.