పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బారిష్టరు పార్వతీశం

రెండవ భాగము

ఎలాగైతేనేమి, ఇంగ్లండులో అడుగు పెట్టానని చెప్పాను కాదూ! మరచిపోకుండా, ఎలాగో జ్ఞాపకం పెట్టుకుని కుడికాలే పెట్టాను కూడాను. నేను ఇంత శ్రద్ధగా ఇంతశాస్త్రయుక్తంగా కుడికాలే పెట్టినా, లండను మట్టుకీ విషయమేమీ గమనించినట్లు కనుపించలేదు. సిడ సిడ లాడుతూ మొగం మాడ్చుకుంటూ, ఆరిపోయిన హారతి పళ్ళెం పట్టుకు నిలుచున్నట్లనిపించింది. ఇంతకూ అదృష్టం బాగుంటే ఏకాలు పెట్టినా ఇబ్బంది లేదు. బాగుండకపోతే ఏ కాలు పెట్టినా ఒకటే.

ఇక్కడ దిగగానే నాలో ఉత్సాహం సగం చచ్చిన దనను కాని చల్లారిందని చెప్పక తప్పదు. కారణమేమిటంటే నేను చెప్పలేను. లండనులో అడుగు పెట్టేసరికి బరామీటరు మరీ దిగిపోయినట్లయింది. నెమ్మదిగా సామాను దింపుకుని Platform మీద నిలబడ్డాను. ఏమి చెయ్యడానికీ తోచలేదు. ఎటు వెళ్ళాలో మొదలే తెలియదు కదా! అంతా అయోమయంగా ఉన్నది. ఇదే మొగల్తుర్రు అయితేనా! స్కూలునుంచీ ఇంటికిరాగానే, నేనేదో చాలా దూరప్రయాణంచేసి వచ్చినట్లు, మా ఇంట్లో వాళ్ళూ, చుట్టుపక్కలిళ్ళల్లో కుర్రవాళ్ళూ బోలెడంత మంది పరుగెత్తు కొచ్చి 'నా చుట్టూ మూగి, ఎంతో సేపు నాతో కులాసాగా ఆడుకునేవారు. మా అమ్మ సంగతి చెప్పనే అక్కరలేదు. "వచ్చావురా నాయనా ముందు కాళ్ళూ మొహం కడుక్కో కళ్ళు దించుకుపోయి బుగ్గలు పీక్కు పోయి ఎలా వున్నావురా నాయనా! "లే" అని నన్ను తొందర పెట్టి, కాళ్ళు కడుక్కున్న తరువాత ఏదో కొంత ఫలహారము పెట్టేది. ఒక్కొక్కప్పుడు నాకు దిష్టి కూడా తీస్తుండేది. నాకెంతో సిగ్గుగా ఉండేది. ఏమిటమ్మా నీ చాదస్తమూ నువ్వూనూ. ఇంకా ఎన్నాళ్పేమిటి ఈ దిష్టి అదీని.