పుట:బహుముఖ ప్రజ్ఞాశాలి మహాకవి దాసు శ్రీరాములు.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బహుముఖ ప్రజ్ఞాశాలి

మహాకవి దాసు శ్రీరాములు

డా. దాసు అచ్యుతరావు

దాసు శ్రీరాములు గారు కీ.శ. 19వ శతాబ్దం ఉత్తరార్థంలో ఆంధ్రదేశంలో జన్మించి ఆంధ్ర సంగీత, సాహిత్య, సాంస్కృతిక, సాంఘిక, రాజకీయ రంగాలను వారి రచనలతో, విశిష్ట వ్యక్తిత్వంతో ప్రభావితం చేసిన మహా పురుషులు.

ఆయన మహాకవి, వాగ్గేయకారులేకాక (1) ప్రతిభావంతుడైన ఉపాధ్యాయుడు (2) ప్రముఖ న్యాయవాది (3) సంఘ సంస్కర్త (4) పత్రికా నిర్వాహకుడు (5) ధర్మశాస్త్ర, జ్యోతిషశాస్త్ర నాట్యశాస్త్ర కోవిదుడు (6) ఆయుర్వేద శాస్త్ర పరిశోధకుడు. వెరసి బహుముఖ ప్రజ్ఞాశాలి.

జననం, విద్య

దాదాపు నాలుగున్నర శతాబ్దాల చరిత్ర గల దాసు వంశంలో ఏప్రిల్ 8, 1846న కృష్ణాజిల్లా కూరాడ గ్రామంలో తన మాతామహుడగు కూరాడ రామచంద్రయ్య గారి ఇంట్లో శ్రీరాములు గారు జన్మించారు. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలంలో అల్లూరి అగ్రహారికులు, సంపన్న కుటుంబీకులు కన్నయ్య, కామమ్మ పుణ్యదంపతులకు ఏకైక సంతానం. తొమ్మిదవ ఏటి వరకు ఇంటి దగ్గరే తండ్రిగారి వద్ద, అడవి సుబ్బారాయుడు గారి వద్ద విద్య నభ్యసించారు. కొద్దికాలం బందరు నోబెల్ స్కూలులో ఇంగ్లీషు, తెలుగు అభ్యసించడానికి వెళ్లారు. కాని కొంత కాలం తర్వాత తల్లిగారు అల్లూరుకు తీసుకువచ్చారు. తర్వాత శ్రీరాములు గారు ఇంట్లోనే ఉంటూ, స్వయంకృషితోనే కవితా పాటవం సంపాదించారు. 12వ ఏటనే “సోమలింగేశ్వర శతకం' ప్రౌఢశైలిలో రాసారు. 'అష్టావధానం', 'వ్యస్తాక్షరి', 'శతషండక వనం' ప్రక్రియలలో నైపుణ్యం సంపాదించారు. 14వ ఏట 'సాత్రాజితి విలాసం' అనే యక్షగానం రాసారు. 1859లో తన 13వ ఏట జానకమ్మ గారితో వివాహమయింది. ఒకరోజు ఇంట్లో చెప్పకుండా 'ఆంధ్రగీర్వాణ పీఠము'గా పేరు గాంచిన ఆకిరిపల్లె వెళ్లి సంస్కృత వ్యాకరణంపై పట్టుసాధించారు. అప్పటి నూజివీటి ప్రభువులు నెలకు 8 అణాల ఉపకారవేతనం ఇచ్చేవారు. ఆ తర్వాత శ్రీరాములుగారు ఇంకొకరి దగ్గరకు వెళ్లి విద్యనేర్చుకోలేదు. స్వయంకృషితోనే అనేక విద్యలు నేర్చుకున్నారు. విద్యాదాతలు అయ్యారు కూడా.

2