పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

46

బసవపురాణము


బసవని లింగైక్యమునకుఁదర్వాత ముప్పదినలువదియేండ్లకు రచితమయినది. చెన్నబసవపురాణము మఱి నన్నూఱేండ్లకుదర్వాత (క్రీ. 1560)ను, బిజ్జలరాయచరిత్ర మంతకింకను దర్వాత (క్రీ. 1600) ను రచితమయినవి. కావున వీనిలో బసవపురాణమే మన కెక్కువ ప్రమాణముగా గ్రహింపఁదగినది. ప్లీటు మొదలగువారు, తెలుఁగు బసవపురాణమును దాని ప్రాచీనతను గుర్తింపమిచే మూఁడుగ్రంథములను సమానదృష్టితోఁ జూచిరి. దేనికిని వారంతగాఁ బ్రామాణ్యము నంగీకరింపరయిరి.

బసవపురాణమునఁ జెప్పఁబడిన విషయములకును, బిజ్జలుని శాసనములఁ బట్టి యెఱుఁగనగుచున్న విషయములకును విరోధ మేమియుఁ గానరాదు గాని, బిజ్జలుని శాసనము లెన్నేని వెలసియుండఁగా నందొక్కదానియందేని బసవనిఁ గూర్చి కాని, వీరశైవమును గూర్చి కాని యే విధమయిన ప్రశంసయుఁ గానరాకుండుట కొంతవింతగాఁ దోఁచును. బసవపురాణమునుబట్టి చూడఁగా బిజ్జలునియొద్ద బసవనిమంత్రిత్వ మానాఁడు పశ్చిమచాళుక్యరాజ్యమున గొప్పయలజడిని మతసంక్షోభమును గలిగించినట్టు కన్పట్టును. ఇంత యలజడి కలిగినప్పుడది బిజ్జలుని శాసనములలోని కేవిధముగానేని యెక్కియుండఁ దగును.

బసవపురాణమున వర్ణితములయిన కథలెల్లనవి యట్లే జరిగినవని చెప్పనలవిగాదు. మడివాలుమాచయ్య, తాను పూర్వదినమునఁ జంపిన మనుష్యుని మర్నా డాకాశముననుండి యవతరింపఁజేయుట, బసవన జొన్నలప్రోవును ముత్యాలప్రోవునుగాఁ జేయుట మొదలగువాని నీ కాలము వారెవ్వరు నమ్ముదురు? అవి యసంభావ్యములు కావనుటకుఁ దగ్గ కాలమింకను రాలేదు. చరిత్రపరిశోధనమున మనమిట్టివాని నర్ధవాదములనుగాఁ గొట్టివేయుచుందుము. ఇట్టి యద్భుతకథలు; మతముతో భక్తితో సంబంధించిన సర్వస్థలములందును గలవు. కాని, బసవనను గూర్చి పాల్కురికి సోమనాథుఁడు చెప్పిన యద్భుతకథలలో నొక్కదానిని మాత్రము బసవన సమకాలమువాఁడే యగు మల్లికార్జున పండితారాధ్యుఁడు గూడ శివతత్త్వసారమున మూఁడుపద్యములలోఁ గొండాడినాఁడు.