పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/393

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

186

బసవపురాణము

వాసుకి మెచ్చక వాని నాలుకలు - గ్రోసెడు నన్నట్టి ఘోరసర్పంబు
గడువలోపలఁబెట్టి, "కలఁడయ్య! యిందు - [1]మృడుసర్వగతుఁడని నొడివెద”వనిన
“కలఁడనుమానమే ఘటములోపలను - కలుగఁడేనియు సర్వగతుఁడె రామయ్య”
యనుచు నూతనపురాతన మహాభక్త - జన పాదపద్మ సంస్మరణాత్ముఁడగుచు
నిర్భయుఁడై చేరి నిలిచి తత్కుంభ - గర్భస్థ మైయున్న దుర్భరోరగము
రోఁజుచుఁబొంగుచు [2]మ్రోగుచు లోనఁ - దాఁజప్పరించుచు దౌడలడఁచుచు
నెడనెడఁగడువలోఁబడఁగడచుచును - గడవడించుచు భుజంగము విజృంభింప
“రామనాథుండు [3]సర్వగతుఁ డవ్యయుఁడు - రామేశుభక్తు లీ భూమి నుత్తములు
పరముఁ గొల్వనివారు పరమపాతకులు - నరులెల్ల వింటిరే నాశపథంబు”
నంచు నా ఘటములో హస్తంబు దొడిగి - పొంచున్న సర్పంబుఁగుంచి తివుచుడును
పటికంపులింగమై స్ఫుటకాంతిఁజేసి - చటుల భాస్కరకరపటల మంతయును
విటతటముగ దిశాతటములఁగప్పఁ - గుటిలాన్యసమయ విఘటనతదీయ
పటుతరకరతల ఘటతమై వెలుఁగ - నటుగూడ జనులు ఖే యని జయవెట్టఁ
దటుకున జైనులు గుటిలత యడఁగి - ఘటితఫాలస్థల కరకంజులుగను
సుగ్గలదేవి యౌత్సుక్యంబు దనర - నగ్గురుదేవుఁదా నగ్గించుచుండ
బల్లహుఁడాదిగా నెల్లజైనులును - దల్లడంబందుచు ధరఁజాఁగి మ్రొక్కి
రంత దేడరదాసమయ్య బల్లహుని - సంతోషమున లింగసహితుఁగాఁజేసి
యిట దర్క ముత్తరించుటఁజేసి యల్ల - పటికలింగంబు నప్పట్టణంబునను
నుత్తరేశ్వరుఁడన నొగిఁబ్రతిష్ఠించి - యత్తఱి నా దాసమయ్య యేణ్ణూరు
వసదులు వ్రప్పించివైచి జైనులకు - నొసఁగఁడే శివదీక్ష యోరి జైనుండ!

హిరియ నాచయ్యగారి కథ


మారుడిగనుపురి మఱియొక్క భక్తుఁ - డారంగ హిరియ నాచయ్యగా రనఁగఁ
బరు లెఱుంగకయుండ భక్తుఁడైయుండఁ - బరవాదిజైనులు వ్రల్లదంబునను
నేడ సూచినఁదామె యెలమిని వెయ్యి - యేడునూర్వసదుల కిది వొడవనుచు
నొక్కశివాలయంబున్నఁ [4]వ్రప్పించి - చక్కన నచటి పూజారిఁగారింపఁ
“బరవాదిజైనులఁబఱపక యింకఁ - బరమున కారగింపఁగఁబెట్టరాదు
తప్పగుఁదడసిన నిప్పురి” ననుచు - నప్పుడ నాచిదేవయ్య దా వెడలి

  1. మృడుఁడు సర్వంబని
  2. మ్రోయుచు
  3. సర్వసమక్షముండు
  4. ద్రవ్వించి