పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

3

నొక సమాధి గల్పింపఁజేసికొని యందు దిట్టముగా విభూతిఁబోయించి దానిపైఁ గూర్చుండి తన శరీరమును గావ శిష్యులను నియమించి యాయతప్రాణుఁడయ్యెను. కొంతకాలమునకు శివుఁడు ప్రత్యక్షమై కైలాసమునకుఁ గొంపోయెద రమ్మనియెను. "సమాధిని దెఱచి యితరు లెఱుఁగకుండఁ గొంపోయెదవేని సమాధిని వీడి సోమనాథుఁ డెక్కడికేని పాఱిపోయె నందురు. సమాధిని దెఱవక కొనిపోయెదవేని సమాధిలో నాతఁడు క్రుళ్లిపోయెనందురు. ఈ రెండపవాదములును బుట్టకుండ నన్నుఁ గొంపొమ్ము. భవిని జూడనను నానియమము దప్పిపోకుండునట్లును, భూమిజనులు నీరూపులో నారూపును జూచునట్లును, నాకుఁ బ్రియమయిన నందిరూపును స్ఫటికమయముగాఁ దాల్చి తద్గర్భమున నన్నుఁజేర్చుకొని లోకులకు సందేహము దీఱునట్లు నాసమాధిపైఁ గొంతదడవు కానవచ్చి భక్తజనులు ప్రస్తుతింపఁగా నన్ను నీలోకమునకుఁ గొనిపొమ్ము" అని ప్రార్థించెను. అంగీకరించి శివుఁడట్లే యాచరించెను.”

పయివిషయములు సోమనాథుని శిష్యున కాఱవతరమువాఁడు చెప్పినవి. ఈ చెప్పినవాఁడు క్రీ.1480 కిఁ దర్వాతివాఁడు. ఇవిగాక సోమనాథుని కృతులను బట్టియుఁ దత్కాలమువారగు మఱికొందఱు కవుల కృతులను బట్టియుఁ గూడ సోమనాథుని చరిత్రము గొంత గుర్తింపనగు చున్నది. వాని నిఁకఁ బరిశీలింతము.

సోమనాథుని కాలము

పిడుపర్తి బసవన కాకతీయప్రతాపరుద్రుని కాలమున సోమనాథుఁడు వర్తిల్లెనని చెప్పినాఁడు. ప్రతాపరుద్రుఁడని పేరు క్రీ. 1292 నుండి 1326 దాఁక నంధ్రదేశమును బరిపాలించిన ప్రతాపరుద్రదేవునకే చెల్లుచున్నది. క్రీ. 1132 నుండి 1198 దాఁక రాజ్యమేలినవాఁడు కాకతీయ రుద్రదేవుఁడు వేఱొకడున్నాఁడు. ఈతఁడు ప్రతాపరుద్రదేవుని యమ్మమ్మతండ్రి యగు గణపతిదేవునికిఁ బెద్దతండ్రి. ఈతనిఁ బ్రథమప్రతాపరుద్రుఁడని సామాన్యముగా నేఁటివారు గొందఱు పేర్కొనుచున్నారు గాని రుద్రదేవుఁడనియే యీతనిపేరు. పిడుపర్తి బసవన్న యని పేర్కొన్నవాఁడు క్రీ. 1292 నుండి 1326 దాఁక రాజ్యమేలిన ప్రతాపరుద్రదేవుఁడు కావలెను. “ఇఁక