పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

బసవపురాణము

నల్పకాలములో రాజ్యము తురుష్కాక్రాంతము గానున్నది” అని సోమనాథుఁ డన్నాఁడన్న బసవన్న రచన కాతఁడయినచో నిర్వాహమేర్పడును.

మఱియుఁ బ్రతాపరుద్రుఁ డొసఁగిన దోకిపఱ్ఱగ్రహారము కొంతకాల మయిన పిదప సోమనాథుని శిష్యసంతతియగు తమ పూర్వులకుఁ జెల్లకపోఁగా సోమనాథుని శిష్యుఁడయిన శివరాత్రి కొప్పయ్య మనుమఁడగు సోమయ్య ప్రౌఢరాయలచేత నాయగ్రహారమును బునఃప్రతిగ్రహము గాంచెననికూడ స్వవంశవృత్తాంతమునఁ బిడుపర్తి బసవన చెప్పుకొన్నాఁడు. ప్రౌఢరాయఁడు క్రీ. 1430 వఱకుఁ బరిపాలించెఁ గాన యాతనిచే నగ్రహారముఁ బడసిన వాని తాత క్రీ. 1326 దాఁక రాజ్యమేలిన ప్రతాపరుద్రదేవుని కాలమున నున్నవాఁడే కావలెను.

మఱియుఁ క్రీ. 1168 వఱకు జీవించియున్న బసవేశ్వరునియు, నటుతర్వాతఁ గొలఁది దినములకు లింగైక్యమందిన మల్లికార్జునపండితారాధ్యులయు జరిత్రములను గథాకోవిదులయిన వృద్ధులవలన విని బసవపురాణమును, బండితారాధ్యచరిత్రమును నద్బుతోత్తరములయిన మాహాత్మ్యప్రశంసలతో రచియించిన సోమనాథకవి బసవేశ్వరునకును, బండితారాధ్యునకును నూఱు నూటయేఁబది యేండ్లకుఁ దర్వాతివాఁడగుననుటయే సంగతముగా నుండును. పయిసాధనములను బట్టి చూడఁగా సోమనాథుఁడు ప్రతాపరుద్రదేవుని కాలము (1292 - 1326) వాఁడే యగుననిపించును. కాని, యింతకంటెఁబ్రబలము లయిన ప్రమాణములు గొన్ని సోమనాథుఁడు (ప్రథమ) రుద్రదేవుని నాఁటి (1132 - 1198) వాఁడే యని నిరూపించుచున్నవి.

కర్ణాటభాషలో సోమరాజనుకవి యుద్భటకావ్యమని యొక ప్రబంధమును రచించెను. అందాతఁడు :

మ. ప్రమథానీక కథార్ణవేందు హరిదేవాచార్యనం ధైర్యనం
     సముదంచద్వృషభస్తవామరమహీజారామనం సోమనం
     విమలజ్ఞాన సుదీపికాస్ఫురితచేతస్సద్మనం పద్మనం
     క్రమదిందం బలగొండు పేళ్వెనొసెదా నీ కావ్యమం సేవ్యమం.