పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/353

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

146

బసవపురాణము

కాంత దన్నెంతయుఁగడవఁబల్కినను - నెంతయుఁ గొన్నాఁడ నే ధనం బనక
కొండొకవ్రొద్దుండి వెండి యేతెంచి - మిండండు బసవనిమెడఁద్రాడు వెట్ట
వలదని వారింప నలుఁగు వెఱికినఁ - దలఁ ద్రుంచివైచితిఁ దప్పెవ్వరిదియొ?
అట్లౌట కీ త్రిపురారియె సాక్షి - పట్టినఁబలికింతు నిట్టని చెపుఁడ”
అనవుడు నతివిస్మయాక్రాంతు లగుచు - జననాథునకు నిట్లు వినుపింపఁదడవ
“యద్దిరా! భక్తుని యఱ [1]గొడ్డెతనము - విద్దె లాడెడుఁగాక విందుమే తొల్లి
విపరీత మిందఱు వినఁ'బలికింతుఁ - ద్రిపురారి' ననుటెల్లఁగపటమో నిజమో?
చూతముకాక!” యంచును బిజ్జలుండు - నేతెంచె నధికవిభూతి భాతిగను
బసవఁడుఁగిన్నరబ్రహ్మయ్య పాద - బిసరుహాక్రాంతుఁడై ప్రీతియెలర్ప
'శృంగారములకీల శివుకరవాలు - మంగళత్వమునికి మానంబుమనికి
విజయంబుత్రుళ్లు వివేకంబుపెల్లు - నిజగుణస్తుతి యూఁత నిష్ఠలచేఁత
సత్యంబుభాతి యాస్థానంబుజ్యోతి - ప్రత్యయంబులరాజు భావుక మోజు
యాగంబు తునియ విరాగంబుగనియ - యాగమంబులతెల్ల [2]హర్షంపుటెల్ల
శాంతంబుప్రోగు సజ్జనభక్తిబాగు - దాంతత పెంపు వ్రతాపంబుసొంపు'
నని యసమాన సమంచితార్థముల - వినయపూర్వకముగా వినుతి సేయుచును
నుండంగ, నఖిలనియోగంబు గొలువఁ - దండతండముల భక్తవ్రాత మలర
గుడివడు గటమున్న కుంచియకోల - పొడసూప కేఁగినయెడఁగిన్నరయ్య
దరహసితాస్యుఁడై తలుపులదిక్కు - నరగంట నొక్కింత యఱలేక చూడ
నఱిముఱి నటమున్న యప్పురాంతకుఁడు - వెఱచితల్పులువాఱఁదెఱచెఁ జోద్యముగ
“దాసికిఁ దెఱచె మున్ దలుపు లనంగ - నాసకలము విందు మది గానఁబడియెఁ
దనరుచుఁ ద్రిపురాంతకుని కవాటములు - గనుఁగొననంతలో నన పాసి పడియె
బాపురే! కిన్నరబ్రహ్మయ్య యింక - నోపుఁబోఁబలికింప నీ పురాంతకుని”
ననుచుఁజూపఱు గనుఁగొని ప్రస్తుతింపఁ - జనుదెంచి బ్రహ్మయ్య సంతోష మలర

కిన్నరబ్రహ్మయ్య పిలువ శివుఁడోయని పల్కుట


“మనసిజక్రీడాంతమునఁజేయివ్రేసి - వనితపాలిండ్లు నీవని నిశ్చయించి
యడరఁగ నాతఁ'డయ్యా!” యని పిలువ - నొడయనంబన్నకు నోయన్న శివుఁడ!
వెలయఁగ[3] దాసమయ్యలవాదులోన - నిలఁబిపీలిక[4]యందుఁబలికిన శివుఁడ!

  1. గొండె
  2. హర్షంబుయె(నె?)ల్ల
  3. దాసుమయ్యల
  4. లోన