పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/352

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాశ్వాసము

145

మనుజులఁబ్రోలిలో మననీరు గాక - పనియేమి గొఱియలకును మీకుఁజెపుఁడ
మామీఁద నొకరాజు మఱి చెప్పఁగలఁడె? - భూమిలో' నన్నట్లు వొడిచివైచెదరు
రాజులకు నిరపరాధులఁజంపు - టోజయే? భక్తుల కుచితంబు గలదె?
కాలఁదన్నుట మాంసఖండంబు లిడుట - బాలునిఁజంపుట ఱాలవైచుటయుఁ
గులములు సెడిపోయి కుడుచుట దండ్రి - తలఁదెగఁగొట్టుట దన్వి నిచ్చుటయుఁ
దమ్ము[1] దొరలఁజాల ధర్మంబు లండ్రు - ఎమ్మెయిఁదగదండు రెదిరి[2] దొరలిన
మీర యేలుదురు గా కీరాష్ట్రమెల్ల - ధారుణి యేలంగఁదమ కింకఁబాసె
నప్పటి కప్పటి కదియేల [3]వెఱవ - నొప్పుకో రాజ్యంబు దప్పేమి”యనుడుఁ
“గర్జంబు మీఁదెఱుంగక పల్కుటెల్ల - బిజ్జలక్షోణీశ పెద్దఱికంబె?
ధర్మము ల్కర్ములు దప్పుదు రెందు - ధర్మముల్ భక్తులు దప్పరు వినుము
కిన్నరబ్రహ్మయ్య సన్నుతకీర్తి - పిన్నవాఁడే యూరకున్నను జంప?
నట్టేల? యెద్దీనె ననుటయు గొందిఁ - గట్టుద మనువారు గల రెట్లు సెపుమ
ఏర్పడఁగార్యాంశమెఱుఁగుము మాట - లార్పుము తగువారి నరయఁగఁబంపు
మఱి యెందుఁబోయెడు మర్యాదలెల్ల - నెఱుఁగుదు గాకేమి యింతయు” ననినఁ
దన ప్రధానులఁ [4]జూచి ధారుణీశ్వరుఁడు - పనిచినఁ ద్రిపురాంతకునిగుడి కేఁగి
కిన్నరబ్రహ్మయ్యఁగన్నంత మ్రొక్కి - "అన్నన్న! తగునె? నీ యట్టి భక్తుండు
హింసకు లోనౌట కేమికారణము? - సంసారి నేటికి సరిచేసికొంటి
విగమెడ దునియెద విదియేమి వుట్టె - జగములలో రిత్తసడి వచ్చె నీకుఁ
గొఱగాని జఱభుల కొయ్యనగాండ్ర - గొఱియల వార్తలు గూడునే త్రవ్వ
భూమీశ్వరుఁడు మమ్ముఁబుత్తెంచె నరయ - నేమని చెప్పుదు మింక” నావుడును
“నివి యేల వెడమాట లిన్నియు వాఁడు - తివియఁదివియఁద్రాడు ద్రెవ్వుడు గొఱియ
గుడిసొచ్చుడును 'బట్టఁగూడదు దీని - విడువుము కాదేని వెలసెప్పి కొనుము
ఇమ్మడి ముమ్మడి యిచ్చెద' ననిన - నెమ్మెయి నొల్లక 'యిట్టి భక్తుండు
వేయిచ్చియైనను విడిపించుఁగాని - యీ యయ్య[5] గొనిపోవనిచ్చునే' యనిన
'విండ్రె యీ మాటలువేయుమాడలకుఁ - గొండ్రె యెచ్చోటను గొఱియ' నన్నట్టు
వెక్కసం బందంగ వేయుమాడలను - జక్కఁగ నెన్నితిఁజౌకంబు ద్రోచి
'యెప్పాట[6] మగిడిన నీఁజుమ్ము' రనుచుఁ - జెప్పి యచ్చొత్తితి శివలాంఛనంబు

  1. దొర్లిన
  2. దొర్లినను
  3. వెఱతు-మొ(ప్పఁగో)
  4. బిల్చి
  5. సంపంగనీఁడు వొమ్మనుడు
  6. మగుడిన