పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

85

నొవ్వియో పొరగప్పెనో? మాదతెవులొ? - పువ్వువట్రిల్ల నాపువుకంటి [1]పోటొ?
మయిలవడ్డదియొ దుర్మాంసదోషంబొ? - అయిరయో వెండియు నక్షిరోగంబొ?
కానోపు ని ట్లనుమానంబు లేదు - దీనికి[2]మందుమాఁకే నే మెఱుంగ
నాయన్న! నా తండ్రి! నాయిష్ట సఖుఁడ! - నా యయ్య! నా జియ్య! నా ప్రాణనాథ!
సర్వాంగసుందర! శంకర! యీవి - గు(గూ?)ర్వణంబెటు దొరకొనెనయ్య! నీకు
ముక్కంటి వాఁడని మూఁడు లోకముల - నిక్కంబు వెఱతురు నిటలలోచనుఁడ!
యెన్నఁడు నీ కొక్క భిన్నంబు లేదు - గన్నుఁ జూచిన నిట్టు గైకొండ్రె సురలు
కంటి చిచ్చున మున్ను గాలిన వారు - కంటివార్తకు నికఁ [3]గనలరే మగుడ;
వినుమెంత గన్ను గానని వలపైన - వనితలిట్లంగ హీనుననకుఁ జిక్కుదురె?
రూపింప నిట్లు కురూపివై యున్న - నేపార భక్తు'లిహీ' యని నగరె
నేఁడెందుఁ [4]బోయెనో నేత్రంబు హరికి - నాఁడిచ్చి నట్టి యనశ్వరమహిమ
పొలమున నాఁ [5]బోతుఁ బులి గొన్నయట్టి - పొలుపయ్యె నేనెట్లు నిలువంగనేర్తు
నెవ్వరి కెఱిఁగింతు? నెట్లు ధరింతు - నెవ్విధిఁబోవుదు? నేమి సేయుదును?
[6]చెప్పంగలేదొండు సేయ లేదొండు - నిప్పాటఁ జూచుచు నేనుండఁ జాల
నాకంటఁ బుట్టిన నాఁటను గోలె - శ్రీకంఠ రోగంబు సెంద దెన్నఁడును
యొప్పని కన్నులో నున్నట్లుగాఁగఁ - గప్పెద నా లెస్సకంట నీ కన్ను
నా కన్న చూ మందు నీ కంటి కనుచుఁ - జేకొని శరమున ఛేదించి పుచ్చి
కఱకంఠు కంటిపైఁ గన్నప్ప దేవుఁ - డఱిముఱిఁ దననేత్ర మర్పింపఁదడవ
అక్కంటఁ దొరుగు ధారావళి యడఁగి - గ్రక్కున డాపలికంట నుప్పొంగఁ
గించి త్ప్రహాస సంకీలితా ననస - మంచితాంభోజాతుఁడై తన నేత్ర
కమలంబుశివునేత్ర కమలమైయునికి - కమితమహోత్సాహ మాత్మఁదుల్కాడఁ
గ్రేకంట లింగంబు డాకన్నుఁ జూచి - యీ కంటికిని మందు నీ కన్నె కాక
యనుమానమింకేల యనుచుఁ దన్నేత్ర - జనిత నిర్మలజలధారదొరుగ
గందువ దన చెప్పుఁ గాలి యుంగుటము - వొందించి డాకన్నువుచ్చఁ గైకొనునడు
నంతలోపలన ప్రత్యక్షమైయప్పు - డంతకసంహారుఁ డనురాగ మెసఁగఁ
గన్నప్పదేవర కరయుగగ్రహణ - సన్నుతహస్తుఁడై చక్కన నిలువఁ
గలిత సమావలోకనమాత్ర యంద - యలరెఁగన్నప్పని వలపలి కన్ను

  1. పాదో
  2. నౌషధంబేనేమెఱుంగ
  3. గలఁగరే
  4. నేఁడెందువో
  5. 'పోఁతు' సానుస్వారముగాఁ గొన్ని ప్రతులలోఁ గానవచ్చును '
  6. చెప్పలే దొండునుజేయ