పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

65

[1]బెద్దయుఁ బుట్టునో పిమ్మటివార్త - దద్దయు విన [2]నోపఁ దా [3]మున్న చత్తు
సమయనిమ్మొండేనిఁ జావనీవేని - యుమియు మివ్విషమొండె నొండు సెప్పకుము
తక్కిన [4]మాటలు దనకింప” వనుచు - నిక్కంబు తెగువమై నిష్ఠించి పలుక
‘నుమియకుండినఁజచ్చునో ముగ్ధ’ యనుచు - నుమ [5]బోటి యాత్మలో నుత్తలపడగ
“నుమిసినఁ [6]గొని కాల్చునోతమ్ము” ననుచుఁ - గమలాక్షముఖ్యులు గడగడ వడఁకఁ
బ్రమథు లాతని ముగ్ధభక్తికి మెచ్చి - యమితమహోత్సవులై చూచుచుండ
నొక్కింత నవ్వుచు నుడురాజధరుఁడు - గ్రక్కున లేనెత్తి కౌఁగిటఁ జేర్చి
ప్రమథులయాన నీ పాదంబులాన - సమయ నివ్విషమున సత్యమిట్లనిన
నమ్మవే వలపలి నా తొడ యెక్కి - నెమ్మిఁ జూచుచునుండు నీలకంఠంబు”
నని యూరుపీఠంబునందు ధరించె - మును గుఱియున్నదే ముగ్ధత్వమునకు
నదిగాక కుత్తుక హాలాహలంబు - కదలినంతటనె చచ్చెదఁగాక! యనుచుఁ
దన కరవాలు ఱొమ్మున దూసి మోపి - కొని కుత్తుకయ చూచుచును ఱెప్పలిడక
పశుపతి తొడమీఁదఁ బాయక రుద్ర - పశుపతి నేఁడును బరగుచున్నాఁడు

నక్కనైనారు కథ


ఇల నొప్పు చోళమండలమున మఱియు - నలి నీలనక్కనైనారనుగణము
ఉవిదయుఁ దానును శివలింగపూజ - సవినయప్రీతిమైఁ జలుపు చున్నెడను
శివదేవుపై నొక్క సెలఁది వ్రాకుడును “శివశివ! ప్రేలు శివునకు” ననుచు
[7]నా పొల్తి యప్పుడ తూపొడ్వఁ దడవ - కోపించి యాతఁడు గొంతి కిట్లనియె
“పాపికా! బ్రమసితే ప్రాణవల్లభునిఁ - దూపొడ్వఁగూడునే [8]తుంపురు ల్నిండ
నిటుగాని నీ భక్తి యెఱుఁగంగరాదె! - యెటయేనిఁ బొమ్ము ని న్నే నొల్ల” ననుచు
వెడలంగ నడిచి యవ్విభుఁ[9]డు దా రాత్రి - మృడునర్చనము సేయునెడ లింగమందు
[10]నక్కాంత దూపొడ్చు చక్కటిఁ దక్కఁ - దక్కెల్లఁ [11]బ్రేలిన నక్కజంబంది
పతి వేగ సతి [12]వెంటఁ బాఱి పాదముల - కతిభక్తియుక్తి సాష్టాంగుఁడై మ్రొక్కి
“పాపి! పొ”మ్మని నిన్నుఁబఱపినయట్టి - పాపంబు సైరింపు పటుభక్తినిరత
నీవు దూపొడిచినఠావు దక్కంగ - దేవుని మేనెల్లఁ జూవె ప్రేలినది
ఈ దిక్కు దూపొడ్చి యీ సంకటంబు - నా దేవునకు మాన్పవే దయతోడ”

  1. బిందంబు?
  2. నోర్వ
  3. మున్నె
  4. బుద్ధులు
  5. కొన్ని ప్రతులలో బోఁటి (స్త్రీ) సానుస్వారముగా నున్నది
  6. గాలుచునో
  7. నా పొలఁతియు నప్డు తూపాడుచుడును
  8. తుంపుర్లు
  9. డర్ధ
  10. నక్కొంత
  11. బ్రేలుడు
  12. వెన్కఁ