పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

95


వీరశైవము బసవేశ్వరాద్యుపజ్ఞమే

లింగధారణమును జెప్పుశ్లోకములు గొన్ని యాగమములలోనివిగాను, బురాణములలోనివిగాను నిటీవలి వీరశైవగ్రంథములందుఁ గలవు. ఆ శ్లోకములే కాక, కొన్ని యాయాగమములుగూడ వీరశైవమతము వెలసిన కాలమునను, నటు తర్వాతికాలమునను నేర్పడినవని నేను దలఁచుచున్నాఁడను. వీరశైవసిద్దాంతమును దెలుపు నాగమము వీరాగమమని యొకటి గలదు. అది యిట్టిదే. ఏలనఁగా నందుఁ బెక్కుచోట్ల నాల్గుశైవమఠములు పేర్కొనఁబడినవి. నల్గురు శైవాచార్యులు పేర్కొనఁబడిరి.

శ్లో. రేవణో మరుసిద్ధేశో రామదేవో మునీశ్వరః,
    పండితారాధ్య ఇత్యేతే చతుర్మఠమునీశ్వరాః.

ఇందు నాల్గవవాఁడగు పండితారాధ్యుఁడు శివలెంక మంచెన పండితుఁ డయినను, శ్రీపతిపండితుఁడయినను, మల్లికార్జున పండితుఁడయినను బసవేశ్వరుని కించుమించుగా సమకాలమువాఁడే యగును. తక్కినవారు గూడ బసవేశ్వరుని నాఁటివారే. ఈ యాగమమున వీరశైవసంప్రదాయము లెల్ల వివరింపఁబడినవి. ఇది పురాతనగ్రంథ మనుట నే నంగీకరింపఁజాల నయ్యెదను. మఱియు రేణుక(రేవణ)సిద్ధరచితము సిద్ధాంతశిఖామణియు, మాయిదేవరచితము శివానుభవసూత్ర(విశేషార్థప్రకాశన)మును, పద్మరసు దీక్షాబోధయుఁ , నీలకంఠాచార్యుని క్రియాసారమును గలవు. వీరశైవసిద్ధాంతమును నిరూపించు గ్రంథములలో మూలభూతము లివి. ఈ గ్రంథముల రచించినవారు బసవేశ్వరుని కాలమువారును దర్వాతికాలము వారును నగుట విస్పష్టవిషయము. బసవపురాణమును బట్టి, అబ్లూరు శాసనమునుబట్టి యీ మతము క్రీ.శ.1150 ప్రాంతమున నేర్పడినది గానే తెలియనగుచున్నది. ప్రాచీనాగమగ్రంథములం దక్కడక్కడ వీరశైవసిద్ధాం తానుకూలములగు శ్లోకములు గొన్నియున్నను, వానినెల్ల నుద్దరించి కులాచారనియమములను ద్రెంచి వీరశైవమని క్రొత్తసిద్ధాంతము నెలకొల్పినవారు మాత్రము బసవేశ్వరాదులే యనుటకు