పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

94

బసవపురాణము


ఉద్బటుఁ డీభోజునకు గురువే యగునేని యాతఁడు నేఁటి యారాధ్యసంప్రదాయమువాఁడు గానేరఁడు. ఆ యుద్భటుని వంశమువారగు నాంధ్రారాధ్యులుగూడ భోజగ్రంథ, గోళకీమఠాచార్యకృత గ్రంథోపదిష్టమగు వైదిక శైవసంప్రదాయమువారే యగుదురు. బసవేశ్వరుని కాలమునుండి యాంధ్రదేశారాధ్యులు వీరశైవులై లింగధారులై యుందురేని కర్ణాటదేశమునఁ బోలె వీరికిని మఠములు, గురుపరంపరలును నుండెడివి. ఆంధ్రదేశమున గోళకీమఠ సంప్రదాయము వారి మఠములే యుండెడివిగాని, నేఁటి యాంధ్రారాధ్య సంప్రదాయము వారి మఠము లెన్నఁడు నున్నట్టు దెలియరావు. పండితత్రయోద్భటారాధ్య వేమనారాధ్యాది వంశపరంపరలవా రాభిజాత్యముగలవా రారాధ్యవంశములవారు పలువురు వెలయుచున్నను, లింగధారణాది దీక్షలు గొనుటలో గురువంశములు, శిష్యవంశములు నను భేదము లేక వీరిలో నెల్లరును సమానసమ్మానమునే పడయుచున్నారు. బహుకాలమున నుండియు నిట్టి సంప్రదాయమే సాగుచున్నచో నిప్పుడు లేకున్నను బూర్వకాలమున నేని యట్టి మఠము లుండకపోవునా యని సంశయము.

దహనసంస్కారము నేఁ డాంధ్రారాధ్యసంప్రదాయమున లేదు. కాని తావన్మాత్రమున వీరు వీరశైవులనఁగాదు. ఇటీవల వీరు లింగధారణముతో పాటు ఖననసంస్కారమునుగూడ పరిగ్రహించియుండవచ్చును. గోళకీమఠ సంప్రదాయమువారు కూడ నుత్తములైన శివదీక్షితులకు నాశౌచముగాని, శ్రాద్ధాదికము గాని యక్కఱలేదనిరి. 'నిర్వాణ దీక్షితానాంతు సూతకం నైవవిద్యతే' - 'దీక్షితానాం చ శైవానాం శ్రాద్ధం స్యాచ్చైవమేవ హి, న వైదికం కృతం శైవం శివలోకం స గచ్ఛతి' - ఆశౌచదీపిక, అఘోరశివాచార్యుఁడు.

ఆంధ్రారాధ్య సంప్రదాయము వారి దీక్ష పేరు చిన్మయదీక్ష. వీరశైవులదీక్ష పే రుత్తరదీక్ష. రెండు సంప్రదాయములు వేఱనుట కిదియు నొక తార్కాణ. కృష్ణదేవరాయలకుఁ బూర్వకాలమున నాంధ్రదేశమున నారాధ్య బ్రాహ్మణులు లింగధారులయి యుండిరనుటకుఁ బ్రబలాధారములు గలవేమో యింకను బరిశోధింపవలసి యున్నది.