పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

90

బసవపురాణము


వీరికి సమ్మతములు. మల్లికార్జున పండితారాధ్యులకు బ్రాహ్మణ్యముమీఁద నాస్థ గలదు. వర్ణాశ్రమధర్మనిబంధనముమీఁదఁ దాత్పర్యము గలదు. శివభక్తియందుఁ దన్మయత్వమును గలదు. బసవేశ్వరుఁడు మహాశివభక్తుఁడని యాయనయెడల నద్భుతగౌరవమును, వైదికకర్మలను గర్హించి వర్ణాశ్రమాచారములను రూపుమాపుచున్నాఁడని యతృప్తియుఁ గాంచినవాఁడై బసవేశ్వరుని దర్శించి వాదించుటకై పోవుచుండఁ ద్రోవలోఁ దన్మృతివార్త వినవలసెననియు, “భక్తిమీఁది వలపు బ్రాహ్మ్యంబుతోఁ బొత్తుఁ బాయలేను నేను బసవలింగ” యని యాతఁడు చెప్పెననియుఁ బ్రతీతి గలదు. దీనిఁబట్టికూడ నాతఁడు బసవేశ్వరుని మతమువాఁడు కాఁడని స్పష్టముగా నెఱుఁగనగును. లింగమును ధరించిన వీరమాహేశ్వరుఁడు (వీరశైవుడు) వర్ణాశ్రమధర్మములను, వైదికకర్మములను నాచరింపరాదని కలదు. ఇట్లు విడుచుటే వీరవ్రతము. వీరశైవులు జంగములయిన (చరించునట్టి) శివలింగములేయని వీరశైవగ్రంథములు పలుకుచున్నవి. శివత్వమును బొందినవారు మరల వైదికకర్మాచరణమునకుఁ బాల్పడరాదు. కర్ణాటదేశమునఁ గల లింగాయతులు సరిగా నట్టి వీరశైవసంప్రదాయమువారు. వారికి లింగధారణము గలదే కాని, యజ్ఞోపవీతాదులు లేవు. వారు బ్రాహ్మణులవలె విశుద్దమయిన సదాచారము గలవారే కాని, బ్రాహ్మణులతోఁ గాని, తదితరులతోఁ గాని సహభోజనమునొల్లరు. వారు బ్రాహ్మణాదివర్ణధర్మముల నభిమానింపరు. ఆంధ్రదేశపుటారాధ్యులు సంపూర్ణముగా బ్రాహ్మణధర్మములు గలవారు. తక్కిన బ్రాహ్మణులతో వీరు సహభోజనము గావింతురు. బ్రాహ్మణ్యము నభిమానింతురు.

దశమశతాబ్ది కింకను బూర్వకాలముననుండి గౌడదేశమున గోళకీమఠ మను పేర గొప్ప శైవాచార్యమఠము ప్రఖ్యాతిగాంచెను. భావశంభు, సోమశంభు ప్రభృతులు తన్మఠాధిష్ఠాతలు. సోమశంభువు తనపేర నొకపద్దతిని రచియించెను. శివలెంకమంచెన పండితుఁ డీ సోమశంభువు మనుమఁడట! ఈ పరంపర వారు 'కలచురిక్ష్మాపాలదీక్షాగురువు' లని పలుచోట్లఁ బ్రస్తుతింపఁబడిరి. కలచురిక్ష్మాపాలుఁడగు బిజ్జలునకుఁ గూడ వీరు గురువులయి యుందురని నేను దలంచుచున్నాఁడను. బిజ్జలుని కాలమునఁ బశ్చిమచాళుక్యరాజ్యమున నీ