పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

86

బసవపురాణము

బసవేశ్వరుని మత మొక్కనూఱేండ్లలోఁ గర్ణాటదేశమెల్ల వెల్లివిరిసినది. ఈ వీరశైవమతమున వేలకొలఁది జనులు ప్రవేశించిరి. బ్రాహ్మణుల దగ్గఱ నుండి చండాలురదాఁక నాకాలమున నీకుల మాకుల మని భేదములేక యెల్లరు కూడిన సంఘమువారే నేఁడు లింగాయతు లనుపేరఁ గర్ణాటదేశమున నున్నారు. బసవేశ్వరుని యనంతరము గొంతకాలమున కాంధ్రదేశమునఁ గూడఁ దన్మతము వారు, జంగములు, వ్యాప్తి చెందిరి.

బసవేశ్వరునకుఁ బూర్వమున్న శైవమతములను గూర్చియు, బసవేశ్వరప్రవర్తితమైన వీరశైవమును గూర్చియుఁ గొంత వివరింతును.

పాశుపతము

ఈ వ్రత మధర్వశిర ఉపనిషత్తునందుఁ జెప్పఁబడినది. శ్రీకంఠభాష్యము గూడ దానినే పేర్కొనుచున్నది. బ్రహ్మప్రణవపంచాక్షరీప్రాసాదాది మంత్రములు, పశు, పతి, పాశాది వస్తువ్యవహారము, భస్మోద్ధూళన త్రిపుండ్రధారణ లింగార్చన రుద్రాక్షధారణాది ధర్మములు పాశుపతులకుఁ గలవని శ్రీకంఠభాష్యమువలనఁ దెలియనగును. ఈ విషయములనే మల్లికార్జున పండితారాధ్యులవారి శివతత్త్వసారము గూడఁ బ్రపంచించి చెప్పుచున్నది. పాశుపతు లద్వైతమతమును మిక్కిలి గర్హించిరి. వారు జీవేశ్వరులకు భేదము చెప్పుదురు. పశువులగు జీవులు పతియగు రుద్రుని యనుగ్రహముచే పాశమయిన సంసారముననుండి ముక్తులై మోక్షసుఖము ననుభవింతురు. జీవులకుఁ బాశబంధము తొలఁగును గాని పశుత్వము తొలఁగదని మల్లికార్జున పండితుఁడు చెప్పెను.

క. గోపతి కృతమున భవపా
   శాపేతములయిన పశువులట్టులు భవపా
   శాపేతులైన పశువులు
   ప్రాపింతురు మోక్షసుఖము పశుపతి నీచేన్.

మఱియు, వారు సన్న్యాసమును గర్హింతురు.