పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

85


సంప్రదాయానుసారముగా శైవమతమును వైదికముగా నీయన నిలువరింపఁ బూనెను. ఇట్టు ప్రాచీనసంప్రదాయములను బరిపోషించుట వలన లాభమంతగాఁ గానరాదని యెఱిగి యింతకంటెఁ దీవ్రముగాఁ గర్ణాటదేశమున బసవేశ్వరుఁడు, ఏకాంత రామయ్య, పద్మరసు మొదలగువారు వర్ణాశ్రమాచారకలితములై యున్న ప్రాచీన శైవమతభేదముల నెల్ల నడచిపుచ్చి వానిలోనుండి వీరశైవమని క్రొత్త శైవమును సర్వశైవమతసారముగా నుద్దరించి నెలకొల్పిరి. దీనినే ప్రాచీన శైవమతములలోఁ దగవులు చల్లారి యైక్యమేర్పడెను. నూతనోత్తేజముఁ గాంచి శైవమతము బలముగలదై నెలకొనెను. వర్ణభేదమును విడుచుటచే నీ శైవము జైనబౌద్ధమతములవలె సర్వసాధారణమై సులువుగా నందఱచే నాదృతమయ్యెను. ఒకప్రక్క నిట్లు వీరు స్వమతమందు సౌలభ్యసౌకర్యములను గల్పించి పలువుర నందుఁ జేర్చుకొనుటతోపాటు, తమకు మతమునఁ బ్రబలప్రాతికూల్యము గలిగియున్న జైనబౌద్ధమతములను దండనీతి నుపయోగించి చెండాడి కూడ స్వమతమును బ్రబలపఱుచుకొనిరి. ఇంతగొప్పకార్యమును సాగించుట సాధారణులకు శక్యముగాదు గదా! పశ్చిమచాళుక్యరాజ్యమును గైవసపఱుచుకొని యేకచ్ఛత్రాధిపతిగాఁ గళ్యాణమున రాజ్య మేలుచున్న బిజ్జలుని మంత్రియు, దండనాథుఁడును మహనీయుఁడునగు బసవేశ్వరుఁడీ సంఘమందు ముందు నిల్చెను. ఈతఁడు స్వయము మహాభక్తుఁడు. శివుని వాహనమగు నందీశ్వరుని యవతారమే యీతఁడని శైవులెల్లరు విశ్వసించిరి. ఆజానజమయి శివభక్తి యీ మహనీయునందుఁ గుదురుకొనెను. శివుఁడే పరతత్త్వమనియుఁ దదన్యదేవతారాధనము దగదనియు నీతఁడు పసిప్రాయమందే నిశ్చయించుకొనెను. వర్ణాశ్రమాచారధర్మములను దదభిమానులయిన తలిదండ్రులను వర్జించెను. తానును దనదోడి శివభక్తులును సుదృఢముగా నేర్పఱుచుకొన్న మతధర్మముల నిర్వహించుటలో నిర్భయతతో మెలగెను. ఆ కాలమునఁ బశ్చిమచాళుక్యదేశమున నీతఁడు మతరాజ్య మేలె ననవచ్చును. తన మతము ననువర్తింపని వారిని జంపించెను. అట్లు చంపవలసినదిగా సంగమేశ్వరదేవుఁ డీతని బాల్యముననే శాసించెనట. ఈ శాసనము ననుసరించి యీతఁడు తన యేలికయగు బిజ్జలునిఁ గూడఁ జంపించెను!