పుట:ప్రబోధచంద్రోదయము.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మలయమారుత బిరుదాభిధానులు

ఘంట సింగయమంత్రి మలయమారుతాంకితుడు. ఈవిషయము తానే చెప్పుకొన్నాడు. ఇక్కవి పారిజాతపహరణ కర్తయగు నందితిమ్మనకు మేనమామ. తిమ్మన నీతనిని "విద్యావివేకచతురఁడని" (5-108) స్తుతించినాడు. ఈ బిరుదుధారులలో సర్వన్నయనుకవి యొకడు కలడు. అతనిషష్ఠస్కంధము నుండి యొకసీసపద్యము ప్రబంధరత్నాకరమున పెదపాటిజగ్గన (1600 ప్రాంతము)చే నుద్ధ రింపబడినది[1]. ఇక మూడవవాడు మల్లన యనుకవి. ఇతని కూర్మపురాణమునుండి యొక కందపద్యము ఆనందరంగరాట్ఛందమున (3-208) పేర్కొనబడినది. దీనినిబట్టి ఇట్టిచిత్రమైన బిరుదము కలవారు మువ్వురు కలరని స్పష్టము.

మలయమారుతమునకు -గల మూడు గుణములలో సౌరభ్యము లేక పరిమళ మొకటి కలదు. కవిత్వమున పరిమళము గుబాళించునట్లు చేయగల కవి కిట్టిబిరుదము లభించును. సంస్కృతమున పరిమళ కాళిదాసు గలడు. అట్లే ఘంట సింగనయు పరిమళయుక్తమైన కవిత చెప్పుటచే నీతనికి

"మలయమారుతకవి"

అనుబిరుదు లభించినట్లు మనము గ్రహింపవచ్చును.

ఇట్టి కవితాసాహితీవిద్యావైదుష్యముగలవారుగాన వీరికి తెలుగు సారస్వతమున - జంటకవులలోనేగాక, కవులలోను ఉన్నతస్థానము లభించినది.

అఘోరశివాచార్యుడు

క.

నెలకొన్నభక్తి సద్గురు
కులచూడారత్నమగు నఘోరశివాచా
ర్యుల దివ్యపాదపద్మం
బులకు నమస్కృతు లొనర్చి పూతాత్ములమై.

(వరాహ-1-19)
  1. ప్రబంధరత్నావళి - కొత్తకూర్పు - 469 పద్యము. (1976)