పుట:ప్రబోధచంద్రోదయము.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అని వరాహపురాణమునను, "అఘోరశివుల భజించి యేకాగ్రచిత్తమునను” అని ప్రబోధచంద్రోదయమునను - ఈశివాచార్యుడు ప్రస్తుతింపబడినాడు. పారిజాతపహరణకర్త నంది తిమ్మనకు నీతడే గురువు. రాజశేఖరచరిత్రకర్త మాదయగారి మల్లనకూడ అఘోరశివాచార్య గురుకరుణావిశేషలబ్ధసారస్వతుడే. అందువలన నీత డాకాలమున ప్రసిద్ధశివాచార్యుడని మనము గ్రహింపవచ్చును[1].

జంటకవుల విద్యావైదుష్యము

వీరు "వాగీశ్వరీ మంత్రసిద్ధిపారగుల" మని చెప్పుకొన్నారు, వాగీశ్వరీ అనగా సరస్వతి - వీరు సరస్వతీమంత్రసిద్ధు లగుటయేగాక - శివప్రసాదలబ్ధసారస్వతు లగుటచేత వీరివిద్యావైదుష్యము ఆధ్యాత్మికవిశేషము గలదని మనము గ్రహింపవచ్చును.

"సంగీతనంది నంది సింగన" అని ప్రబోధచంద్రోదయ ప్రారంభంబునను ఆశ్వాసాంతగద్యలలో 'సారస్వతాభినంది నందిసింగన' అని చెప్పబడియుండుటచేతను నందిసింగన సంగీతసాహిత్యముల యందు రెండింటను ప్రవీణుడని తెలియుచున్నది. కావున సంగీతసాహిత్యములు వీరికి వంశానుగతము.

వీ రుభయభాషాకవితాదక్షులని యీ క్రింది యుదాహృతులు తెలుపుచున్నవి.

"ఉభయభాషల నేర్పరులు”
"భాషాద్వయకృతి నిరూఢశేముషీభూషణులు"

కాలనిర్ణయము

ప్రబోధచంద్రోదయము, వరాహపురాణము, కవులషష్ఠము అనువీరి మూడుకృతులలో మొదటది ప్రబోధచంద్రోదయము.

  1. ఈతని గూర్చిన వివరములు ఆంధ్రదేశ చారిత్రక భూగోళ సర్వస్వము మొదటి సంపుటములో చూడనగును.