పుట:ప్రబోధచంద్రోదయము.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

నిట్లుకడలేని యాసాస లీనుచుండ
జనులు బ్రహ్మాండకోటులఁ దనివినొంద
రనిన శాంతికి, గాలూదనైనఁ గలఁదె
యెడము మదిఁ దృష్ట నీవింత వెడలితేని

(2-64)


శ్లో.

నరాస్థినూలాకృత భూరి భూషణః
శ్మశానవాసీ నృకపాలభోజనః
పశ్యామి యోగాంజనశుద్ధదర్మనో
జగన్మిధోభిన్న మభిన్న మీశ్వరాత్

(2-12)


సీ.

పుట్టింప రక్షింపఁ బొలియింపఁ గర్తయౌ
                          భైరవేశ్వరుడు మాపాలివేల్పు
ప్రమదనటద్భూతభయదశ్మశానశృం
                          గాటకంబులు మాకు నాటపట్లు
నక్షత్రపటలీవలక్షంబు లైనన
                          రాస్థిఖండములు మాహారతతులు
నీహారకరబింబనిభమానవశిరఃక
                          పాలము ల్మాభుక్తిభాజనములు


గీ.

గాఁ జరింతుము తమలో జగంబులెల్ల
వేరువేరైన శివునితో వేరుగా వ
టంచుఁ జూతుము సిద్ధయోగాంజనపు
దీపితంబైన సుజ్ఞానదివ్యదృష్టి.

(3-32)

ఇచ్చటను చిన్నవృత్తమునకు నీపద్యము చేకొనబడినది. భైరవేశ్వరుడు మాపాలివేల్పు అనునది యనువాదమున చేర్చబడినది. ఇచటను మూలమున మూడువిశేషణములు మాత్రమే కలవు. శ్మశానవాసము, కపాలభోజనము, అస్తిహారము. నాల్గవపాదపూరణమునకై భైరవేశ్వరుడు చేర్చబడినాడు. ఇది యుచితమే.