పుట:ప్రబంధసంబంధబంధనిబంధనగ్రంథము.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు
శ్రీ కాశీవిశ్వనాథాయ జగద్గురు గణపతయేనమః

మండపాక పార్వతీశ్వరకవీశ్వర కృతమగు
ప్రబంధసంబంధబంధనిబంధనగ్రంథము

పూర్వపీఠిక

క.

శ్రీరసికు లెన్న బంధో
ద్ధార మొనర్పఁదగు నేర్పుఁ దనకుంబలె నా
కారూఢిం గలిగించిన
కారుణ్యమయాకృతిన్ జగత్పతి నెంతున్.

1


సీ.

శ్రీమత్పినాకినీసింధుతీరమున భాసిల్లు నెల్లూరిలో నుల్లసిల్లు
పూండ్లవంశంబునఁ బొడమి యీపుడములోఁ గవిపక్షపాతియ న్ఖ్యాతి వడయఁ
గడఁగి యముద్రితగ్రంథచింతామణియను పత్రికను బ్రకటన మొనర్చు
శ్రీరామకృష్ణాఖ్యచేఁ దనర్చు నుదారకవి గోరి వ్రాసినకారణమున


గీ.

మహితబొబ్బిలిపురి నుండు మండపాక
పార్వతీశ్వరకవి కతిపయకవిత్వ
బంధముల కొకలక్షణగ్రంథ మిపుడు
క్రొత్తగా నేర్చిన ట్లొనగూర్చె నిట్లు

2


చ.

సుకవులు బంధలక్ష్యములె చూపిరి గాని తదర్హలక్షణం
బొకరును జూపరైరని తదుద్ధరణార్థము పూండ్ల రామకృ
ష్ణకవి దృఢప్రతిజ్ఞుఁడు రసజ్ఞుఁడు గావునఁ బూనియుండెఁ గౌ
తుకమునఁ బార్వతీశ్వరుఁడు దోడ్పడఁ దత్ఫలసిద్ధి కబ్రమే.

3


చ.

కవులు నిరంకుశప్రతిభ గల్గినవా రగుటన్ స్వతంత్రులై
వివిధవిచిత్రబంధములు వృత్తనిబంధము లేక క్రొత్తక్రొ
త్తవి దమచిత్తవృత్తియె నిదానముగా మును గూర్చి రైన సూ
క్ష్మవిధి నొనర్తు లక్షణము మత్కృతలక్ష్యపురస్సరంబు గాన్.

4


చ.

అమలమతుల్ వినుం డొకరహస్యముఁ దెల్పెద సంప్రదాయసి
ద్ధములగు కొన్నిబంధములుదప్పఁ దదన్యము లెప్పుడైనఁ గ
ర్తృమహిమ నించుమించులగు నిట్టినిమిత్త మెఱింగి నాదుపొ
త్తముఁ గను నప్పు డిప్పు డిది తప్పని తప్పని దెప్పఁబోకుఁడీ.

5


ఉ.

నాల్గుతెఱంగులైన కవనంబున బంధకవిత్వ మన్నిటం
దెల్గునఁ గూర్చు టెన్నిటను దీరనికష్టము తద్విశిష్టరే
ఖ ల్గడముట్టునట్టు లొకకట్టడ పుట్టకయున్న నున్నబి
ట్ట ల్గనుపట్టు నెట్టని కడంగి తొడంగితి దీనిఁ జేయఁగాన్.

6


ఉ.

చిన్నతనంబునందె పితృసేవ యొనర్చుచు వారణాసిఁ గొ
ల్వన్నడతెంచుచుం బ్రకృతిబంధవిముక్తికిఁ జిత్రబంధముల్
మున్న విముక్తనాయకుఁడు మోదిలఁగూర్చితి నాటిబంధము
ల్గొన్ని యుదాహరింతు నిఁట లోపము లున్నను సైఁపుఁ డున్నతుల్.

7


క.

లక్షణము లేనివానికి
లక్షణము లభించెనని తలంచి యపేక్షన్
లాక్షణికులు వీక్షింతు ర
సూక్షణకు లుపేక్ష గలిఁగి చూడకయున్నన్.

8