భైరవుఁడు - శ్రీరంగమహత్త్వము [4-273]
సీ. |
మదషట్పదంబుల మధుపానభూములు
రాజకీరంబుల రచ్చపట్లు
పుంస్కోకిలంబుల భోజనశాలలు
మలయానిలంబుల మలయునెడలు
[1]నవమయూరంబుల నాట్యరంగంబులు
మకరకేతను సభామండపములు
విటవిటీజనముల విరుల చప్పరములు
మధులక్ష్మి [2]నైపథ్యమందిరములు
|
|
తే. |
నల వసంతుని లీలావిహారసీమ
[3]లిట్టలంబగు [4]వలపుల పుట్టినిండ్లు
చిరపరిశ్రాంతపథికసంజీవనములు
పావనంబులు పురము కేళీవనములు.
| 253
|
నండూరి మల్లయ్య - హరిదత్తోపాఖ్యానము
చ. |
నవరుచిపల్లవస్థితిఁ దనర్చి లసత్సుమనస్సమృద్ధివై
భవమున [5]నొంది గంధబహుబంధురతన్ దగి యాశ్రితద్విజో
త్సవములఁ బొల్చి వారవనితామణిరీతిఁ ద్రివిష్టపంబుఠే
వ వరగజంబుమాడ్కిఁ గ్రతువాటిగతిన్ బురితోట లొప్పగున్.
| 254
|
[6]బొడ్డపాటి పేరయ్య - శంకరవిజయము
ఉ. |
ఆమని టెంకిపట్లు మలయానిలు నిత్యవిహారసీమముల్
కాముని పాలెముల్ శుకపికంబుల జీతపుటూళ్ళు కామినీ
కాముకవిశ్రమంబులకుఁ [7]గట్టని [8]యోవరు లా పురాంగనా
స్తోమమునందు నెందు నెలతోఁటలు శైలశిలోన్నతస్థితిన్.
| 255
|
సరోవరము
సంకుసాల సింగయ్య - కవికర్ణరసాయనము [1-24]
చ. |
అలికులకుంతలంబులు రథాంగకులంబులు పద్మవక్త్రముల్
గలరవపద్మినుల్ కడువికాసముతోఁ దమయందు సక్తలై
యలర విహారవేళఁ దమునంటిన కాంతల మేని కస్తురిన్
జులకన సోడుముట్టు సరసుల్ సరసుల్ వలె నొప్పు నప్పురిన్.
| 256
|
- ↑ క.నగ
- ↑ క.నైవేద్య
- ↑ క.నిట్టలంబగు
- ↑ క.పువ్వుల
- ↑ ట.బొంది
- ↑ జొన్నపాటి
- ↑ క.గల్లని
- ↑ క.యోర్య+, ట.యోర్వకు