Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


              రతిరాజు మోహనాస్త్రములు గాని
బంధురస్థితిఁ బొల్చు కంధరంబులు గావు
              కందర్పు విజయశంఖములు గాని


తే.

నళినదళలోచనలు గారు నడవ నేర్చు
కంతు నవశస్త్రశాలలు గాని యనఁగ
నంగకంబుల సౌభాగ్య మతిశయిల్ల
వారసతు లొప్పుదురు పురవరమునందు.

221

మాదయగారి మల్లయ – రాజశేఖరచరిత [1-48]

ఉ.

గబ్బిపిసాళి వాలుఁ దెలికన్నుల తేటమిటారి చూపులన్
మబ్బుకొనంగఁజేసి విటమానసముల్ దమి[1]వెల్లి ముంపుచున్
గుబ్బ మెఱుంగుఁ జన్నుఁగవ కుంకుమపూఁతల కమ్మతావి యా
గుబ్బులుగాఁ జరింపుదురు కొమ్మలు తత్పురమార్గవీథులన్.

222

మదిరాసి మల్లుభట్టు - జలపాలిమహత్త్వము

సీ.

కచభరకృష్ణమేఘంబులఁ బ్రభవించు
              మెఱుంగుఁదీగెలరీతి మేను లలర
[2]తారుణ్యవదనేందుదరహాసచంద్రిక
              లక్షిచకోరంబు లనుభవింప
నతులసౌందర్యాబ్ధి కధరబింబద్యుతుల్
              పవడంపుఁదీగెలబాగు మెఱయ
జగముఁ గెల్వఁగ దక్షనగరంబు దొన సేసి
              మరుఁడు దాచిన దివ్యశరము లనఁగ


తే.

సరసలీలావలోకన చతురగతుల
నప్సరఃస్త్రీసమూహంబు లభ్యసింపఁ
బద్మినీజాతిముఖ్యస్వభావములను
వన్నె [3]గలిగుందు రప్పురి వారసతులు.

223

అంగద బసవయ్య - ఇందుమతీకళ్యాణము

ఉ.

బీద శచీవిభుండు దితిబిడ్డ లవార్యులు వారు పల్మఱున్
బాధలఁ బెట్టఁగాఁ జెరలు పట్టఁగ నుండుట భారమంచు రం
భాదిమరున్నివాస [4]లసదప్సరల్ చనుదెంచి వచ్చిరో
నా దరఫుల్లపద్మవదనల్ విహరింపుదు రప్పురంబునన్.

224
  1. క.వెల్లబుచ్చుచున్
  2. ట.వదనేందు దరహాసవరశరచ్చంద్రిక
  3. ట.మెఱయుదు
  4. క.వస