|
పరికింప నరిది యయ్యును
సరసిజకైరవవికాససంపద దెలియన్.
| 1667
|
[1]ఏర్చూరి సింగరాజు - కువలయాశ్వచరిత
ఉ. |
గోపురగోపురప్రతిమ గోపురముల్ చెలువొంద నప్పురిన్
మాపులు రేపులుం గనలు మంజులగీతవినోదకృత్యముల్
చూపఁగఁ గిన్నెరాదు లవి చూచునెపంబున వచ్చి నేర్తు రా
లాపవిశేషనర్తనవిలాసకలాపముల న్ముదంబులన్.
| 168
|
ఎఱ్ఱాప్రెగడ - మల్హణకథ [1-35]
చ. |
[2]గములుగఁ బద్మరాగములఁ [3]గమ్రమరీచులు చౌకళింపఁగా
గమలవనంబు నెన్నఁడు వికాసము [4]గుందవు వజ్రమౌక్తికా
సమరుచిచంద్రికన్ గుముదషండములుం గసుగందకుండు నాఁ
గొమరగు దివ్యరత్నమయగోపురవైభవ మెన్న నేటికిన్.
| 169
|
దేవగేహములు
చ. |
వరకనకప్రభాతివిభవంబున మేరుమహీధరంబులై
నిరుపమవజ్రమౌక్తికవినిర్మలకాంతుల వెండికొండలై
సురుచిరరత్నదీధితుల సొంపున రోహణపర్వతంబులై
పురమున దేవగేహములు పొల్పెసలారును వైభవోన్నతిన్.
| 170
|
పొన్నాడ పెద్దిరాజు - ప్రద్యుమ్నచరిత
చ. |
ఇలకు నుపేంద్రుతోఁ దగిలి యీశుఁడు వేల్పులపిండు వెండి గు
బ్బలికిని [5]బైఁడికొండకును బాలెము నిచ్చలుఁ జేయు చంద్రసూ
ర్యుల నిలఁ దెచ్చిరో యనఁగ నొప్పగు నప్పురి హేమరత్నమం
డలిఁ దగి [6]రాగభోగపరిణాహము లయ్యెడి దేవగేహముల్.
| 171
|
గృహములు
[7]ఏర్చూరి సింగయ్య - కువలయాశ్వచరిత
శా. |
ప్రాచీనంబులు రత్నకాంతులు లసత్ప్రాకారముల్ హేమముల్
సూచింపన్ ఘనవేదకుట్టిమము లాశుభ్రాంశుకాంతంబులై
యేచోట న్వరరత్నజాలములచే నింపొంది సొంపొందుచున్
వాచాగోచరమై గృహంబు లమరున్ వస్తుప్రశస్తోన్నతిన్.
| 172
|
- ↑ క.ఏచూరి
- ↑ క.గములగు
- ↑ క.గ్రమ్ము
- ↑ క.నొందవు
- ↑ క.పేటి
- ↑ ట.నాగ
- ↑ క.ఏచూరి